వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్ క్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0 నిర్వహించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఇందులో 2024 , 2025 సంవత్సరాల్లో 3,567 మంది నిందితులు అరెస్టయ్యారని, వీరిలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన 9 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. స్టేషన్ల వారీగా పర్వతగిరి–ఒకరు, సంగెంలో ఇద్దరు సుబేదారిలో ఒకరు, హనుమకొండలో ఇద్దరు, నర్సంపేటలో ఒకరు, కాజీపేటలో ఒకరు, నర్మెట్టలో ఒకరు ఉన్నట్లు వివరించారు. నిందితులు భవిష్యత్‌లో ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు చట్టబద్ధంగా జీవిస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు, మోసాలను గమనించిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (2023–24 బ్యాచ్) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
విద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరా రు. దరఖాస్తులు ఈనెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారని పేర్కొన్నారు. శిక్షణ పొందాలనుకునేవారు 2025 జూలై1 వరకు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. టెన్త్ పరీక్ష ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సులో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించారు. దరఖాస్తులు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.గౌ ట్.ఇన్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మే1 నుంచి జూన్ 11 వరకు 42 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ..
ఖిలా వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బొల్లం రమేశ్ శనివారం కరీంనగర్ కమిషనరేట్ పరిధి తిమ్మాపూర్ సర్కిల్‌కు బదిలీ అయ్యారు. ఈమేరకు మల్టీజోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తిమ్మాపూర్ సర్కిల్లో పనిచేస్తున్న గడ్డం సదన్కుమార్ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శాయంపేట సీఐ..
శాయంపేట: శాయంపేట మండలంలో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న సీఐ రంజిత్‌రావు బదిలీల ప్రక్రియలో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధి సుల్తానాబాద్‌కు బదిలీ అయ్యారు. నేర పరిశోధనలో సీఐ రంజిత్‌రావు చాకచక్యంగా వ్యవహరించారని ఎస్సై జక్కుల పరమేశ్ అన్నారు.
విజయ డెయిరీ వరంగల్ డీడీ శ్రవణ్..
హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ వరంగల్ మిల్క్ షెడ్ డిప్యూటీ డైరెక్టర్ కె.శ్రవణ్‌కుమార్‌ను బదిలీ చేస్తూ తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్‌లో మార్కెటింగ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.ధన్‌రాజ్‌కు వరంగల్ డీడీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


