హన్మకొండ: జనగణన ప్రక్రియలో భాగంగా.. ఈనెల 26వ తేదీ నుంచి స్వీయ గణన ప్రారంభమవుతుందని, మే 10 వరకు కొనసాగుతుందని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం జన గణనలో భాగంగా ఈ సారి స్వీయ గణనను చేపట్టిందన్నారు. ప్రజలు ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా వివరాలు నమోదు చేయవచ్చన్నారు. స్వీయ గణన కోసం https://se.census.gov.in లింక్‌ను ఓపెన్ చేసి కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం 11 అంకెల ఐడీ నంబర్ జనరేట్ అవుతుందని, ఆ ఐడీని భద్రపర్చుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ నంబర్ చూపిస్తే, వారు ధ్రువీకరించి ఫైనల్ చేస్తారన్నారు. జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని స్వీయ గణనలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రామ్ దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
విస్తృతంగా అవగాహన కల్పించాలి
వరంగల్ అర్బన్: మహా నగర ప్రజలకు స్వీయ గణనపై విస్తృతంగా అవగాహన కల్పించాలని బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో స్వీయ గణన నిర్వహణపై ఆర్పీలు, సీఓలు, వార్డు ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వతంత్రంగా ఆన్ లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. సెన్సెస్ మాస్టర్ ట్రైనీ కంజర్ల రమేశ్ ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి


