గీసుకొండ: కొమ్మాల శివారులోని 165 సర్వే నంబర్‌లో ఉన్న 5.27 గుంటల భూమిని ఎస్సీ, ఎస్టీ కలెక్టర్ సత్యశారద శనివారం పరిశీలించారు. సూర్యతండాకు చెందిన అజ్మీరా రాందాన్‌కు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారికి కొమ్మాల శివారులో 5.27 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. కుటుంబంలోని కొందరు తగాదా పడి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి రికార్డులను పరిశీలించి ఫిర్యాదుదారులు, కొనుగోలుదారుల స్టెట్‌మెంట్‌ను రికార్డు చేస్తామని, అక్రమాలు జరిగాయని తేలితే బాధ్యులపై కమిషన్ తీర్పు మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అసైన్డ్ భూమి కావడంతో ఎవరూ అమ్మవద్దు, కొనవద్దని ఆదేశించారు. వివాదంలో ఉన్న భూమికి సంబంధించిన పూర్తి నివేదికను కమిషన్‌కు నివేదిస్తామన్నారు. బాధితులకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే వారు సివిల్ కోర్టుకు వెళ్లవచ్చన్నారు. వరంగల్ ఆర్డీఓ సుమ, గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, రైతులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
న్యూశాయంపేట: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ శంభునిపేట దూపకుంట రోడ్డులోని మైనారిటీ గురుకులంలో ఈనెల 18 నుంచి 13 రోజుల పాటు నిర్వహిస్తున్న వేసవి క్రీడలు ప్రత్యేక క్యాంపును శనివారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి వాలీబాల్, చెస్ ఆడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్డర్ సంధ్యారాణి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, ఆర్‌ఎల్సీ డాక్టర్ సతీశ్, ప్రిన్సిపాల్ నీలిమాదేవి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
పనితీరు, లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఐసీడీఎస్ సూపర్‌వైజర్లను హెచ్చరించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యలో వరంగల్ నగరంలో నిర్వహిస్తున్న బాలరక్షాభవన్, స్వధార్ గృహాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాలను నిర్వహరణ తీరును అడిగి తెలుసుకున్నారు. పనితీరులో వెనుకబడిన కొంతమంది సూపర్‌వైజర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి నుంచి తక్షణ వివరణ కోరారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సంబంధిత సీడీపీఓలు, సూపర్‌వైజర్లు ఉన్నారు.


