ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

గీసుకొండ: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ముఖ్యమని డీపీఓ కె.కల్పన పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని పంచాయతీలకు మరియపురం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన 9 లక్ష్యాలను మరియపురం చేరుకోవడం గొప్ప విషయం అన్నారు. సమస్యలను గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. సర్పంచ్‌ తిరుమల్‌రెడ్డి అర్పిత అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఎంపీఓ పాక శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ శివప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి స్వప్న, సెర్ప్‌ సీసీ బొజ్జ సురేశ్‌, నాయకులు దిలీప్‌రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్యాస్‌ పైపులైన్‌ లీక్‌తో మంటలు

ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది

గీసుకొండ: గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ కట్లమల్లన్న ఆలయం (కీర్తినగర్‌) సమీపంలో గొర్రెకుంట క్రాస్‌ నుంచి గొర్రెకుంటకు వెళ్లే రోడ్డు పక్కన మెగా కంపెనీకి చెందిన గ్యాస్‌ పైపులైన్‌ శుక్రవారం సాయంత్రం లీకై మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయడానికి నీటిని స్ప్రే చేశారు. అయినా మంటలు ఆగకపోవడంతో గ్యాస్‌ కంపెనీవారికి సమాచారం అందించారు. వారు జాన్‌పాక వద్ద పైపులైన్‌కు వచ్చే గ్యాస్‌ను నిలిపివేయడంతో మంటలు ఆగిపోయాయి. ఆర్‌ఐ శ్రీధర్‌, గీసుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జాగ్రత్త చర్యలు చేపట్టారు. చెలరేగిన మంటలతో ఎవరికి ఎలాంటి హాని కలగలేదు.

తల్లిదండ్రులు మృతి.. అనాథలైన ఇద్దరు పిల్లలు

పర్వతగిరి: తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారుల అనాథలయ్యారు. ఏనుగల్‌ గ్రామానికి చెందిన ఉడతల సుధాకర్‌ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. కాగా, సుధాకర్‌ భార్య మౌనిక కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో వారి కుమారులు శివ, హన్సిక్‌ అనాథలుగా మారారు. శివ ఆరో తరగతి, హన్సిక్‌ మూడో తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రుల మృతితో వీరు స్కూల్‌కు వెళ్లడం ఇబ్బందిగా మారనుంది. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. తోట వీరశేఖర్‌ 8801802324, గూడ నరేందర్‌ 9866291917 నంబర్లకు ఫోన్‌ పే చేయాలని విజ్ఞప్తి చేశారు.

రిటైర్డ్‌ ఉద్యోగుల

బెనిఫిట్స్‌ చెల్లించాలి

విద్యారణ్యపురి: రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్‌ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్‌లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్‌ మొబిలైజేషన్‌ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్‌ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆ కమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement