● ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్య
● జిల్లాలో 32 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) ఒక వరంగా మారింది. మారుమూల గిరిజన పల్లెల విద్యార్థులను పట్టణాల్లోని ప్రతిష్టాత్మక కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యనందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రతి ఏటా ఈ పథకం అమలవుతుంది. గిరిజన ఉపప్రణాళిక క్రింద ఎంపిక చేసిన విద్యార్థులను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తుంది. కేవలం ఫీజులే కాకుండా పుస్తకాలు, యూనిఫాం, హాస్టల్ వసతి కూడా ప్రభుత్వం భరిస్తుంది.
ఎంపిక విధానం ఇలా..
జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి మొత్తం 32 సీట్లు ఉన్నాయి. మూడో తరగతిలో 50 శాతం అనగా 16 సీట్లు, ఐదో తరగతిలో 25 శాతం అనగా 8 సీట్లు, ఎనిమిదో తరగతిలో 25 శాతం అనగా 8 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం సీట్లలో 33 శాతం బాలికలకు కేటాయిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే ఈ స్కీంకు అర్హులు. దరఖాస్తుల ఆధారంగా లాటరీ ద్వారా పారదర్శకంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి.
అన్ని వసతులతో నాణ్యమైన విద్య..
కార్పొరేట్ స్థాయిలో ఉన్న వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందుతుంది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ఈ స్కీం అమలుతో డ్రాపౌట్స్ తగ్గుతాయి. ఎంపికై న విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలుసుకోడానికి ఐటీడీఏ అధికారులు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శిస్తారు. విద్యార్థుల హాజరు మార్కులు, ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. సాధారణంగా గిరిజన విద్యార్థులు తమ గూడేల్లోని ఆశ్రమ పాఠశాలలకే పరిమితమవుతారు. ఈ స్కీం ద్వారా వారు నగరాల్లోని కార్పొరేట్ పాఠశాలల్లో అడుగుపెడుతున్నారు. విభిన్న నేపథ్యాలు కలిగిన విద్యార్థులతో కలిసి చదవడం వల్ల వారి ప్రపంచ దృక్పథం మారుతుంది. నిధులు కేటాయించి, పర్యవేక్షణను పటిష్టం చేస్తే మట్టిలో మాణిక్యాలు గిరిజన గూడేల నుంచే పుట్టుకొస్తారనడంలో సందేహం లేదు.
దరఖాస్తుకు ఆఖరు తేదీ 29..
అర్హులైన విద్యార్థులు ఈనెల 29లోగా దరఖాస్తు తీసుకోవాలి. కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికెట్ (ప్రస్తుతం చదుతున్న పాఠశాల నుంచి), ఆధార్‌కార్డులను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తులను హనుమకొండ అశోక్‌కాలనీలోని అంబేడ్కర్ భవనం ఎదుట ఉన్న జిల్లా గిరిజన సంక్షేమాధికారి కార్యాలయంలో వచ్చేనెల 7లోగా సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.


