● నెక్కొండలో డీఎంఓను కోరిన
మొక్కజొన్న రైతులు
● తమ ఇబ్బందులు పట్టించుకోరా అని జిల్లా మార్కెటింగ్ అధికారిపై ఆగ్రహం
నెక్కొండ: మక్కల కొనుగోలు కేంద్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ అధికారి (డీఎంఓ) కె.సురేఖను రైతులు కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం నెక్కొండలోని పీఏసీఎస్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని డీఎంఓ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిర్వాహకుల తీరుతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. రైతుల ఇబ్బందులు అధికారులకు పట్టవా అని వారు డీఎంఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20 వేల నుంచి 25 వేల గన్నీ బ్యాగులు పక్కదారి పట్టిన విషయమై విచారణ చేపట్టాలని వారు కోరారు. మార్కెట్ పెద్ద మొత్తంలో మక్కలు రావడంతో తలెత్తుతున్న సమస్యలపై ఆమె రైతులతో మాట్లాడారు. అలాగే హమాలీలు, కూలీలతో మాట్లాడి కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. హమాలీల సంఖ్యను పెంచుకొని శనివారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరారు. లారీ, గన్నీబ్యాగుల సమస్య తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాని పీఏసీఎస్ సిబ్బందిని ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి కృష్ణమీనన్‌రావు, పీఏసీఎస్ సీఈఓ జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.


