● స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మల్లక్‌పల్లిలో శుక్రవారం రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్న రైతులు ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొంటుందని, కొనుగోళ్లతో సీజన్‌కు ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల నష్టం వస్తున్నప్పటికీ రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తోందన్నారు. మల్లక్‌పల్లి, ధర్మాపురం రైతులకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. స్థానిక సర్పంచ్ గిన్నారపు లత, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


