హన్మకొండ: ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. శుక్రవారం రాత్రి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ఆర్టీసీ కార్మికులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కొలా శంకర్‌గౌడ్‌కు నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే కోలా శంకర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చేస్తున్న కాలయాపనతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చాలన్నారు. సత్తయ్య, వీకే.స్వామి, బట్టు స్వామి, రమేశ్, రంజిత్, మురళి, రంగు శ్రీధర్, మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


