వరంగల్ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జూనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా హనుమకొండ జిల్లాకు చెందిన ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (విజిలెన్స్) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి (పీజీఎం) ఎన్.శాంతి సోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఈ స్థానానికి రంగా రెడ్డి జిల్లా కూకట్‌పల్లి మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ప్రతీక్‌సిహగ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్.శ్రావణస్వాతిని రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్‌లోని మొదటి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసి ఆమె స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న తాడూరి మహతివైష్ణవిని నియమించారు. హనుమకొండ మూడం మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి సిరిసల్లా ప్రియాంకను రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి (పీడీఎం)గా బదిలీ చేసి, రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పీసీఆర్ కోర్టు జడ్జి శ్రద్ధాసేహగల్‌ను నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన జడ్జిలు ఈనెల 27 వరకు తమ ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ కావాలని, మే 2 వరకు బదిలీ అయిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
రిజిస్ట్రార్‌కు ఏబీవీపీ వినతి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం ఉదయం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు.
విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్‌లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆకమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య, శ్యామ్, క్షీర సాగర తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేఎన్ స్టేడియంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, క్రికెట్, కబడ్డీ, లాన్‌టెన్నిస్, వాలీబాల్, ఖోఖో, బాక్సింగ్ క్రీడాంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు https://satgasc.telangana.gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జేఎన్‌ఎస్‌లోని డీవైఎస్‌ఓ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.


