సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి

చేనేత, జౌళి శాఖ వరంగల్‌ ఆర్‌డీడీ జయరావు

కమలాపూర్‌: విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని చేనేత, జౌళి శాఖ వరంగల్‌ ప్రాంతీయ ఉప సంచాలకులు కె.జయరావు సూచించారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ఆధ్వర్యంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ (డీహెచ్‌టీటీ) కోర్సుపై కమలాపూర్‌లోని చేనేత సహకార సంఘంలో శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. డీహెచ్‌టీటీ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రముఖ వస్త్ర పరిశ్రమల్లో డిజైనర్లుగా, మేనేజర్లుగా స్థిరపడే అవకాశం ఉంటుందన్నారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో చేనేత రంగం కేవలం మగ్గానికి మాత్రమే పరిమితం కాలేదని, ఐఐహెటీ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ (సీఏడీ), టెక్స్‌టైల్‌ కెమిస్ట్రీ, స్మార్ట్‌ గార్మెంట్‌ తయారీ వంటి అంతర్జాతీయ స్థాయి అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి చేనేత విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.4,250 ఫీజుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించే సువర్ణావకాశాన్ని జిల్లాలోని చేనేత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించారు. చేనేత, జౌళి శాఖ డీఓ వెంకటేశ్వర్లు, ఏడీఓ సునీత, చేనేత సంఘ మేనేజర్‌ సామల దామోదర్‌, జిల్లా చేనేత శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement