వరంగల్‌ ఏసీపీ పోస్టుపై అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ ఏసీపీ పోస్టుపై అనాసక్తి

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

సాక్షి, వరంగల్‌: వరుస వివాదాలకు కేంద్రబిందువు అవుతున్న వరంగల్‌ పోలీసు డివిజన్‌లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. అక్కడికొచ్చేందుకు ర్యాంకర్‌ ఆఫీసర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ డివిజన్‌ పరిధిలోని మిల్స్‌కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్‌ ఠాణాల్లోనూ నమోదువుతున్న కొన్ని కేసులు కూడా రాజకీయపరమైన వైషమ్యాలకు అవకాశం ఇస్తుండడం.. వరంగల్‌ తూర్పులో అధికార కాంగ్రెస్‌ పార్టీలో రెండు వర్గాలు ఉండడంతో డైలమాలో పడుతున్నట్లు తెలుస్తోంది. 2025 జూన్‌ 29వ తేదీ ముందు పనిచేసిన ఏసీపీ నందిరాంనాయక్‌ను 2025 డిసెంబర్‌ 22న తప్పుడు కేసులో ప్రమేయముందని తేలడంతో సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 2025 జూన్‌ 29 తర్వాత ఏసీపీగా ఇక్కడకు వచ్చిన యువ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఎన్‌.శుభం ప్రకాశ్‌ 10 నెలల తిరగకముందే పదోన్నతిపై నిజామాబాద్‌ అదనపు డీసీపీ (అడ్మిన్‌)గా వెళ్లడంతో ఇక్కడ ఏసీపీ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఈయన సమయంలో ఆయా ఠాణాల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు, శ్రుతిమించుతున్న ఘటనలు నమోదయ్యాయి. ఒకవర్గానికి చెందిన రాజకీయ నేతల అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇలా నేరాలు ఎక్కువవుతున్నా.. పరిష్కరించడంలో వెనుకబడిపోయారు.

డివిజన్‌ పరిధిలో నేరాలు నిత్యకృత్యం

వరంగల్‌ పోలీసు డివిజన్‌ పరిధిలోని మిల్స్‌కాలనీ ఠాణాపరిధిలో 2025లో 643 కేసులు, 2026లో మార్చి చివరి నాటికి 260 కేసులు నమోదయ్యాయి. మట్టెవాడ పోలీసుస్టేషన్‌ పరిధిలో 2025లో 553 కేసులు, 2026లో 190 కేసులు నమోదయ్యాయి. ఇంతేజార్‌గంజ్‌ ఠాణా పరిధిలో 2025లో 514 కేసులు నమోదైతే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 161 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అయితే ఈ డివిజన్‌ పరిధిలో వ్యాపార సముదాయాలు, మాస్‌ ప్రాంతాలు, మురికివాడలు ఉండడంతో ఇక్కడ నేరాలనేవి నిత్యకృత్యంగా మారాయి. దీనికితోడు రాజకీయ వైరుధ్యాలు కూడా ఇక్కడ పనిచేసే పోలీసులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు అధికారులు బాహాటంగానే ఒక వర్గానికి మద్దతుగా పనిచేస్తుండడంతో సస్పెండ్‌ అవుతున్న ఘటనలు సైతం జరుగుతున్నాయి. ఈ వ్యవస్థను గాడిన పెట్టడానికి పోలీసు ఉన్నతాధికారులు ర్యాంకర్‌ ఆఫీసర్‌ను ఇస్తారా.. లేదా ఐపీఎస్‌ అధికారికి వరంగల్‌ ఏసీపీగా అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే ర్యాంకర్‌ అయితే రాజకీయనేతల ప్రలోభానికి ఏదో సందర్భంలో గురయ్యే అవకాశముంటుందని, అందుకే నిక్కచ్ఛిగా పనిచేసే ఐపీఎస్‌లకే అవకాశం ఇవ్వాలని అంటున్నారు.

వివాదాలకు కేంద్రమవుతుండడంతోనే వెనుకడుగు

అధికార పార్టీలో రాజకీయ వైషమ్యాలు మరో కారణం

ఇప్పటికే గతంలో ఏసీపీతో పాటు పలువురిపై వేటు

ర్యాంకరా...లేదా ఐపీఎస్‌ అధికారి వస్తారా అనే చర్చ

పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

Advertisement
 
Advertisement
Advertisement