చెన్నారంలో గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

చెన్నారంలో గాలివాన బీభత్సం

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

వర్ధన్నపేట: మండలంలోని చెన్నారం గ్రామంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న 50 మంది రైతులకు చెందిన 500 క్వింటాళ్ల మొక్కజొన్నలు తడిసిముద్దయ్యాయి. అదేవిధంగా వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోయాయి. పలు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి పోయి గ్రామంలో అంధకారం ఏర్పడింది.

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు

మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట: హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంప పెట్టుగా ఉందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. గురువారం వర్ధన్నపేటలోని ఎంఎంఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అన్నారు. రెండు పిల్లర్లు కుంగినంత మాత్రానా కావాలని ప్రాజెక్టులో నీరు నింపక ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో సబ్బండ వర్గాలను ఆదుకున్నారని కొనియాడారు. పార్టీ మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్‌, కౌన్సిలర్లు గుజ్జ వీరరాఘవరావు, తిరుపతి సురేశ్‌, బానోత్‌ జ్యోతి నవీన్‌, తుమ్మల అరుణ శ్రీధర్‌, నాయకులు మార్త సారంగపాణి, పూజారి రఘు, కొండేటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏనుమాముల మార్కెట్‌లో రైతుల ఆందోళన

ఖిలా వరంగల్‌: మార్క్‌ఫెడ్‌ అధికారులు మక్కలు కొనుగోలు చేయాలని వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు గురువారం ఆందోళన చేశారు. మార్కెట్‌లో మార్కెఫెడ్‌ మక్కల కొనుగోళ్లను నిలిపివేయడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కొనుగోలు చేసిన మక్కలకు కాంటాలు వేయడం లేదు. మక్కలు నింపేందుకు గన్నీ సంచులు ఇవ్వకపోడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పది రోజులుగా మక్కల కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే మార్క్‌ఫెడ్‌ అధికారులు స్పందించి మక్కల కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కాగా, వర్షం వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు రైతులకు టార్పాలిన్లు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement