రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

కమలాపూర్‌: ధాన్యం కొనుగోళ్ల సమయంలో కోతల పేరిట రైతులను ఇబ్బందుకు గురి చేయవద్దని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. కమలాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఐకేపీ–సెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్‌ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం, మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బుధవారం కౌశిక్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యూరియా కొనుగోళ్ల కోసం యాప్‌, వరి ధాన్యం కొనుగోలు కోసం జీపీఎస్‌ విధానం కాకుండా పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొనుగోళ్లకు సంబంధించి మిల్లర్లు అనేక సాకులు చూపుతూ 5 నుంచి 7 కిలోల వరకు కోత విధిస్తున్నారని, కోతల విషయాన్ని స్థానిక నేతలతో పాటు తమ దృష్టికి తీసుకొస్తే దానికి కట్టడి చేస్తామని రైతులకు సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచులు పబ్బు సతీశ్‌, బండి వనజకళాధర్‌, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ ఝాన్సీరవీందర్‌, డీఆర్డీఓ మేన శ్రీను, ఎంపీడీఓ గుండె బాబు, ఏఓ వేణు, ఐకేపీ ఏపీఎం లలితాదేవి, పీఏసీఎస్‌ కార్యదర్శి సురేశ్‌, మార్కెట్‌ కార్యదర్శి యాకయ్య, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ సంపత్‌రావు, కాంగ్రెస్‌ నాయకుడు బాలసాని రమేశ్‌గౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ దేశిని ఐలయ్య, డైరెక్టర్లు, ఐకేపీ, పీఏసీఎస్‌ సిబ్బంది, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

పొంచి ఉన్న ముప్పు..

హుజూరాబాద్‌లో డంపింగ్‌ యార్డు ఏర్పాటుతో కమలాపూర్‌ మండలానికి కూడా పెను ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌లో డంపింగ్‌ యార్డు ఏర్పాటుతో భూపాలపల్లి, పరకాల, ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి కమలాపూర్‌ మీదుగానే చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తారని, దీంతో పర్యావరణం, గాలి, నీరు కలుషితం అవుతుందని, తాగే నీరు, పీల్చే గాలి విషపూరితం అవుతుందని, పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడుతారన్నారు. వ్యవసాయ భూముల ధరలు లక్షల్లో నుంచి వేలల్లోకి పడిపోతాయన్నారు. డంపింగ్‌ యార్డును నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, డంపింగ్‌ యార్డు రద్దు కోసం గురువారం తలపెట్టిన పాదయాత్రకు నియోజకవర్గంలోని ప్రజలంతా పార్టీలకతీతంగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

వరి, మొక్కజొన్న కొనుగోలు

కేంద్రాలు ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement