కొన్నది కొసరంతే! | - | Sakshi
Sakshi News home page

కొన్నది కొసరంతే!

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

జిల్లాలో మొక్కజొన్నల సేకరణ అంతంత మాత్రమే

సాక్షి, వరంగల్‌: జిల్లాలో మార్క్‌ఫెడ్‌ అధికారుల ప్రణాళిక లేమితో మక్క రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి కేవలం ఇప్పటివరకు కొన్నది 21వేల మెట్రిక్‌ టన్నులే. అంటే దాదాపు 7 శాతమే అధికారులు కొనుగోలు చేశారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో తెలుస్తోంది. జిల్లాలో అరకొరగా ఏర్పాటు చేసిన 13 కొనుగోలు కేంద్రాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దీనికితోడు జిల్లాలో 50,000 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం మేర గోదాములు ఉండడం కూడా ఈ మక్కల కొనుగోళ్లలో అధికారుల నిరాసక్తతకు మరో కారణంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ప్రతి మండలానికి ఐదుకుపైగా కేంద్రాలు ఏర్పాటుచేసి మక్కలను కొనుగోలు చేసిన అధికారులు ఇప్పుడు ఆమేర ఆలోచన చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అలాగే, మక్కల ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్‌)లో లేకపోవడం కూడా కేంద్రం కొనుగోలు చేయకపోవడం ఈ పరిస్థితికి మరో కారణం. మొక్కజొన్నను పీఎస్‌ఎస్‌ కింద చేర్చి కేంద్ర నోడల్‌ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

తగ్గని దళారుల దూకుడు..

ఈ కొనుగోలు కేంద్రాల్లో చాలాచోట్ల మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 చెల్లించాలి. తేమ శాతం 13 ఉంటేనే తీసుకుంటున్న కేంద్రం నిర్వాహకులు 51 కిలోలు బస్తాకు కాంటా వేస్తున్నారు. ఒక కిలో కాంటా బస్తా కింద తీసుకుంటున్నారు. ఎకరాకు 24.50 క్వింటాళ్ల కొనుగోలు నిబంధన మాత్రమే ఉంది. ఆ ఎకరంలో దిగుబడి వచ్చిన మరో 16 క్వింటాళ్లను రైతులు దళారులకు రూ.1,700 నుంచి రూ.1,800 మధ్య అమ్ముకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే ఆయా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో వేల బస్తాల్లో మక్కలతో పాటు ఆరబోసినవి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో మక్కలను సకాలంలో గోదాములకు చేర్చేందుకు 40 లారీలు అందుబాటులో ఉంచినా కూడా అనుకున్న మేర కొనుగోళ్లు జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. చివరకు అధికార ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి మక్కలను కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

రైతుల ఖాతాల్లో జమకాని నగదు...

జిల్లాలో ఇప్పటివరకు 21 వేల మెట్రిక్‌ టన్నుల మక్కల కొనుగోళ్లు జరిగినా రైతుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్‌ కాలేదని తెలుస్తోంది. దాదాపు రూ.50.40 కోట్లు రైతులకు రావాల్సి ఉంది. గతంలో వారం నుంచి 10 రోజుల్లో డబ్బులు వస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కేంద్రం నిర్వాహకులు, అధికారులు 45 రోజుల్లో నగదు జమ అవుతుందని చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. దీనిపై అధికారులు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సాధ్యమైనంత తొందరగా మరో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని, డబ్బులు కూడా నిర్ణీత సమయంలోగా రైతుల ఖాతాల్లో డిపాజిట్‌ చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లాకు సంబంధించిన మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు.

మార్క్‌ఫెడ్‌ లక్ష్యం 3,00,000 మెట్రిక్‌ టన్నులు.. కొనుగోళ్లు 21 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే

రైతులకు చెల్లించాల్సినవి రూ.50.40 కోట్లు

భారీగా పంట వస్తుందని అంచనా

అధికారుల అలసత్వంతో రైతులకు తప్పని ఇబ్బందులు

కొనుగోలు కేంద్రాల వివరాలు..

వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌, నర్సంపేట మార్కెట్‌, నెక్కొండ మార్కెట్‌ పర్వతగిరి మార్కెట్‌, చౌటపల్లి, దుగ్గొండి మండలంలోని మహమ్మదాపురం, నల్లబెల్లి మండల కేంద్రం, ఖానాపురం, సంగెం, వర్ధన్నపేట మార్కెట్‌, రాయపర్తి, వరంగల్‌ మండలంలోని ఆరెపల్లి, గీసుకొండ మండలంలోని ఊకల్‌ గ్రామంలో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement