‘సీకేఎం’ను సందర్శించిన అదనపు కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

‘సీకేఎం’ను సందర్శించిన అదనపు కలెక్టర్‌

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

కాశిబుగ్గ: వరంగల్‌ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లేబర్‌ రూం, ఐసీటీసీ వార్డు విభాగాలను పరిశీలించారు. ముఖ్యంగా వార్డులు, పరిసరాల పరిశుభ్రతపై చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం, వాటర్‌ బాటిళ్లను తీసే పొడవైన చెత్త పికర్‌నుతో డెమో చేయించారు.

మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీస్‌

పర్వతగిరి: మండలంలోని మోడల్‌ స్కూల్‌/కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌లో 79 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 16 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కాగా, రాష్ట్రంలోనే అతి తక్కువ (20.25 శాతం) ఉత్తీర్ణత సాధించిన కళాశాలగా నిలిచింది. దీంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. మోడల్‌ స్కూల్‌ నిర్వాహకుల పనితీరుకు ఫలితాలు అద్దం పడుతున్నాయి.

ఔషధ, పండ్ల మొక్కలు నాటాలి : డీఆర్‌డీఓ

సంగెం: గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, ఇంటి ఆవరణలో ఔషధ, పండ్లు, నిత్యజీవితంలో ఉపయోపడే మొక్కలను నాటాలని డీఆర్‌డీఓ నాగపద్మజ సూచించారు. గుంటూరుపల్లి, కాపులకనిపర్తి గ్రామాల్లోని నర్సరీలను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. బొప్పాయి, కరివేపాకు, మునగ లాంటి ఆరోగ్యకరమైన చెట్లను పెంచితే మేలన్నారు. పొందుపు సంఘాల మహిళలు, రైతు సమాఖ్యలు ముందుకు వచ్చి మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని కోరారు. ప్రతీ ఇంటిలో కనీసం ఐదు మొక్కలను పెంచాలని, ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం పెంపొందుతుందని పేర్కొన్నారు. అనంతరం కాట్రపల్లిలోని గౌండ్ల కుంటను సందర్శించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ప్రతీ 40 మందికి ఒక మేట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. పనిప్రదేశాల్లో కూలీలకు నీరు, నీడ లాంటి అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు. ఎంపీడీఓ రవీందర్‌, ఏపీఓ గణేశ్‌, సర్పంచ్‌లు శ్రీకాంత్‌, చంద్రమౌళి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నియామకం

గీసుకొండ: కొనాయమాకులలో ఆరె కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓలిగే నర్సింగరావు బుధవారం జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులుగా తుమ్మనపల్లి శ్రీనివాస్‌, డోలె చిన్ని, గుండెకారి జగన్‌, కౌడగాని తిరుపతి, కోశాధికారిగా కౌడగాని మోహన్‌రావు, ఉపాధ్యక్షులుగా శిరీష రాజేశ్వర్‌రావు, ల్యాండే రమేశ్‌, పుష్కురి ధర్మేంద్ర, కుసుంబ తిరుపతి, కొల్లూరి రవీందర్‌, కిరణ్‌కుమార్‌, ప్రచార కార్యదర్శులుగా యుగంధర్‌, రాజు, రాజేశ్వర్‌రావు, రవీందర్‌, విరాట్‌, మల్హర్‌రావు, అంజిబాబు, కార్యదర్శులుగా సదానందం, రాజీరు, రఘుపతి, శంకర్‌రావు, సంపత్‌రావు, జగదీశ్‌, రమేష్‌, మోహన్‌రావు, రాజు, కృష్ణంరాజు, ముఖ్య సలహాదారులుగా కలువల ఆనందరావు, ఇంగే రామారావు, వరికెల సాంబశివరావు, మీడియా ఇన్‌చార్జ్‌ లుగా మదన్‌మోహన్‌రావు, కమలాపురం రాజును నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరెకుల సంఘం రాష్ట్ర నాయకులు ఇంగ్లీ శివాజీ, సుకినే రాజేశ్వర్‌రావు, జిల్లా నాయకుడు గుండెకారి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కాకతీయుల

కట్టడాలు అద్భుతం

ఖిలా వరంగల్‌: కాకతీయుల కట్టడాల మహా అద్భుతంగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల సెక్షన్‌ ఆఫీసర్లు కొనియాడారు. మంగళవారం ఖిలా వరంగల్‌ మధ్యకోటను వారు సందర్శించారు. శిల్ప కళా సంపదను తిలకించారు. అనంతరం ఖుష్‌మహల్‌, ఏకశిల గుట్ట, మట్టి, రాతికోట అందాలను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్‌ రవి వివరించారు. కార్యక్రమంలో టూరిస్ట్‌ పోలీస్‌ అనంద్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మిల్స్‌ కాలనీ పోలీసులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement