వంద క్వింటాళ్ల బియ్యం మాయం! | - | Sakshi
Sakshi News home page

వంద క్వింటాళ్ల బియ్యం మాయం!

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

దుగ్గొండి: చలపర్తి గ్రామంలోని గిడ్డంగుల సంస్థకు చెందిన 10 వేల మెట్రిక్‌ టన్నుల గోడౌన్‌లో వంద క్వింటాళ్ల బియ్యం మాయమైనట్లు సమాచారం. మంగళవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గోడౌన్లలోకి మిల్లర్లు ఏసీకేల రూపంలో బియ్యం పంపిస్తారు. ఏసీకే (290 క్వింటాళ్లు) చొప్పున 6 ఏసీకేలు అంటే 1740 క్వింటాళ్లు (3,480 బస్తాలు) ఒక బెడ్‌గా వేస్తారు. ఇలా ఒక బెడ్‌లో ఉండాల్సిన బియ్యం కన్నా వంద క్వింటాళ్లు (200 బస్తాలు) తక్కువగా ఉన్నాయని విజిలెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ సంధ్యారాణి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోడౌన్‌లో వంద క్వింటాళ్ల బియ్యం మాయం అయ్యాయని, రూ.4.37 లక్షల అవినీతి జరిగిందని బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ సాయిరమణ గోడౌన్‌లో బుధవారం విచారణ చేపట్టారు. గోడౌన్‌లో ఎన్ని లాట్లు ఉన్నాయి, లాట్‌లో బస్తాల సంఖ్య, రికార్డుల్లోని సంఖ్యను సరిపోల్చి నట్లు తెలిసింది. కాగా, బియ్యం మాయమైన ఘట నలో గోడౌన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పాత్ర ఉందని అనుమానాలు వస్తున్నాయి.

సూపర్‌ఫైన్‌ స్థానంలో ముక్కిన బియ్యం..

ఇదే గోడౌన్‌లో సూపర్‌ఫైన్‌ బియ్యానికి బదులు ముక్కిన, నాణ్యత లేని బియ్యం దిగుమతి చేసుకున్నారే సమాచారంతో ఏడాదిన్నర క్రితం విజిలెన్స్‌ దాడి చేసింది. విచారణ చేపట్టిన కలెక్టర్‌ సత్యశారద నాణ్యత లేని 9 లారీల బియ్యాన్ని వెనక్కి పంపి మళ్లీ నాణ్యత గల బియ్యాన్ని అదే మిల్లర్‌ చేత తెప్పించి సరిచేశారు. గోడౌన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో అవకతవకలు జరుగుతున్నాయని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

చలపర్తి గోడౌన్‌లో సిబ్బంది చేతివాటం

అధికారుల అండదండలపై అనుమానాలు

Advertisement
 
Advertisement
Advertisement