గీసుకొండ: గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి డీఏ–జేజీయూఏ కింద విద్యుత్ కనెక్షన్, మీటరు ఇచ్చి, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్పీడీసీఎల్ కన్‌స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ (సీఈ) జేఆర్ చౌహాన్, వరంగల్ ఆపరేషన్స్ ఎస్‌ఈ ఆనందం అన్నారు. సూర్యతండాలో గీసుకొండ, సంగెం మండలాల గిరిజన గ్రామాల సర్పంచ్‌లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతీ గ్రామంలోని ఎస్టీ కాలనీలు, గృహాలకు అంతరాయం లేకుండా విద్యుత్‌ను అందించడానికే ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రెండు మండలాల్లో 2,100 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఇప్పటికే 80 శాతం పనులు జరిగాయని చెప్పారు. అవసరమైన కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమకు లిఖిత పూర్వకంగా చెప్పాలని వారు కోరారు. సర్పంచ్‌లు వారి గ్రామాలకు సంబంధించిన సమస్యలను అధికారులకు విన్నవించారు. మరో నెల రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కన్‌స్ట్రక్షన్ డీఈ జాటోత్ నాయక్, ఆపరేషన్స్ ఏడీఈ బానోత్ రవి, ఏడీఈ రాంరెడ్డి, సర్పంచ్‌లు బానోతు రాఘవేంద్ర, ఆంగోత్ వీరన్న, కేలోత్ అమృత భిక్షపతి, భూక్యా వీరేందర్, కన్నెబోయిన యమున ప్రవీణ్, ధరావత్ జ్యోతి తిరుపతి, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.


