గీసుకొండ: మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను సంఘటితంగా నివారించాలని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వసుధ అన్నారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండలంలోని గంగదేవిపల్లిలో గీసుకొండ, సంగెం మండలాల అంగన్‌వాడీ టీచర్లకు లింగాధారిత హింస, మహిళా చట్టాలపై బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వసుధ హాజరై మాట్లాడుతూ లింగవివక్షతో మహిళలు హింసకు గురవుతున్నారని, మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయన్నారు. ప్రతిఒక్కరూ మహిళాభివృద్ధి, సంక్షేమం, రక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో బాలల పరిరక్షణ, సంక్షేమం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలు, బాలల అభ్యున్నతికి కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేట సీడీపీఓ మాట్లాడుతూ మహిళా చట్టాలు, సహకరించే సంస్థలు గురించి తెలుసుకోవాలన్నారు. సర్వోదయ సంస్థ ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఇందిర మహిళా చట్టాలు, మహిళల కోసం పనిచేసే వ్యవస్థల గురించి వివరించారు. డీసీపీఓ ఉమ, పోషణ్ అభియాయాన్ కోఆర్డినేటర్ కార్తీక్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ కల్పన, ఐసీడీఎస్ ఈఓ మౌనిక, సూపర్‌వైజర్లు రేవతి, ఈశ్వరి, మాధవి, కోఆర్డినేటర్ అక్తర్, వాణి, సుహాసిని, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వసుధ


