కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
శాయంపేట : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం పనులు చేపట్టే ప్రదేశాల్లో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. మంగళవారం మండలంలోని మైలారంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల వారోత్సవాల సందర్భంగా గ్రామంలోని ఉపాధి పనులను కలెక్టర్ పరిశీలించారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకోగా తమకు మూడు నెలల నుంచి కూలీ డబ్బులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ కూలీ డబ్బులు ఇచ్చేలా చూస్తానని తెలిపారు. అనంతరం ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి జీపీలో చెత్తపై నిర్లక్ష్యం ఎందుకని పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పనులు త్వరగా పూర్తిచేయాలి
మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించి పరిశీలించారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను అటకెందుకెక్కించారని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు వినియోగించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్నారులతో ఆంగ్ల పద్యాలను చదివించి వారి అభ్యసన స్థాయిని అంచనా వేశారు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలను, మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకొని మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. ట్యాప్స్ కూడా తక్కువగా ఉన్నాయని, టైల్స్ కూడా బాగలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ బుక్ చేసుకోవాలని.. గ్యాస్ కొరత ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఎంఈఓ భిక్షపతికి సూచించారు. ఎంజేపీ పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన విధానంపై వివరాలు అడిగి తెలుసుక్నునారు. డీఆర్‌డీఓ శ్రీను, ఆర్డీఓ నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ ఫణిచంద్ర, సర్పంచ్ నూనె దివ్య ఎంఈఓ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఎంజేపీ ప్రిన్సిపాల్ రేవతి తదితరులు ఉన్నారు.


