కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజలు తమ సమస్యలు వినిపిస్తూ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతి పత్రాలు అందించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 129 అర్జీలు అందినట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో వడగాలుల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పక్షులు, పశుసంపదకు తాగునీటి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్‌లో 139 దరఖాస్తులు..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొని ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 139 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల సమక్షంలోనే చర్చించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ పరి ష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూశాఖకు 54, హౌసింగ్ 21 జీడబ్ల్యూఎంపీ 18 , ఇతర శాఖలకు చెందిన 46 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో వైవీ.గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి ఆర్డీఓ సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కాగా, తమ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం దగ్గరలో కాకుండా మరో కూడలిలో శివాజీ విగ్రహాన్ని పెట్టాలని బొల్లికుంట ఎస్సీ కులస్తులు విన్నవించారు. అదేవిధంగా నా తండ్రి నాగవెల్లి సారంగపాణి ఖోఖో క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించారు. గతేడాది ఆగస్టులో మృతిచెందాడని, మా కుటుంబానికి ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం లేదా కనీస నివాస సదుపాయం కల్పించాలి’అని సారంగపాణి కూతురు నాగవెళ్లి మహాలక్ష్మి వేడుకున్నారు.


