నల్లబెల్లి: విద్యార్థుల ఆరోగ్యంపై బాధ్యత లేదా..? పాఠశాలలో వంటశాల, డైనింగ్ హాల్ ఇంత అపరి శుభ్రంగా ఉంటాయా..? అని కలెక్టర్ సత్యశారద.. హెచ్‌ఎం, వార్డెన్‌లను నిలదీశారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవం కార్యక్రమంలో సోమవారం మండలంలోని మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. వంటశాల, స్నానపు గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణలోని లోపాలను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వంట పాత్రలను శుభ్రం చేసేందుకు ఎరువుల సంచి ముక్కలను వాడడం.. ఇడ్లీ పాత్రలను గమనించిన కలెక్టర్ ఇంత అపరిశుభ్రమైన పాత్రల్లో విద్యార్థులకు ఇడ్లీలు ఎలా వండి పెడతారు.. పిల్లల ఆరోగ్యంపై బాధ్యత లేదా..? అని వార్డెన్ స్వరూపపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డార్మెంటరీ హాల్, మరుగుదొడ్లు నిత్యం శుభ్రంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొత్త బియ్యం సరఫరా చేయడంతో అన్నం సరిగా ఉడకడంలేదని, కూర్చోవడానికి బెంచీలు లేవని విద్యార్థినులు.. కలెక్టర్‌కు తెలియజేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తనకు నేరుగా ఉత్తరాలు రాయాలని విద్యార్థినులకు కలెక్టర్ భరోసా కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతి రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలని, పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద విద్యార్థులకు సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎం శ్రీనివాస్‌ను ఆదేశించారు. సురక్షిత ప్రయాణంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తూ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వెంట జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పుష్పలత, తహసీల్దార్ కృష్ణ, అడిషనల్ డీపీఆర్‌ఓ ప్రేమలత, సర్పంచ్ సపావట్ కవిత దేవ్‌సింగ్, హెచ్‌ఎం శ్రీనివాస్, వార్డెన్ స్వరూప, పాఠశాల స్టాఫ్ సెక్రెటరీ దేవిలాల్ ఉన్నారు.
వార్డెన్‌పై కలెక్టర్ ఆగ్రహం
డైనింగ్ హాల్ నిర్వహణపై అసహనం
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
కలెక్టర్ సత్యశారద


