సాక్షి, వరంగల్: జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల సమీపంలో అవినీతి చేతులు చాస్తోంది. ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా.. ఒక్కసారైనా విచారించిన దాఖలాలు లేవు. ఇటీవల ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో వరంగల్ రూరల్, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై చర్చ నడుస్తోంది. ఈ మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 120 నుంచి 150 వరకు దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతుండడంతో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు దళారులుగా అవతారమెత్తి అక్రమంగా సుమారు రూ1,50,000 వరకు వసూలు చేస్తున్నారు. ఆ మొత్తంలో కొంత వాటాను కార్యాలయ సిబ్బందికి ఇస్తారనే ఆరోపణలున్నాయి. తాము తీసుకున్న సొమ్ములో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటెండర్ నుంచి సబ్ రిజిస్ట్రార్ వరకు వాటాల రూపంలో కొంతమొత్తాన్ని ఇవ్వాల్సిందేనని డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు. ఇదంతా బహిరంగా రహస్యమైనప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
రూ.లక్షల్లో దందా
ఒక ఇల్లు రిజిస్ట్రేషన్‌కు సుమారు రూ.5 వేలు, నాలా కోసం రూ.10 వేలు, ప్లాట్ అయితే రూ.1,500, వివాహ రిజిస్ట్రేషన్‌కు రూ.1,200 చొప్పున కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు వసూలు చేస్తున్నారు. ఒకవేళ దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే పైనపేర్కొన్న మొత్తానికి రెండుమూడు రేట్లు ఎక్కువగానే దరఖాస్తుదారుడు చెల్లించాల్సి వస్తుంది. ఇవేకాకుండా స్లాట్ బుకింగ్, దస్తావేజుల తయారీ పేరు మీద రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతీ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలోని అడ్డాల్లో అందినకాడికి దండుకుంటున్నారు. ప్రతి రోజు ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సుమారు 85, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 25, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇలా ఒక్కో రిజిస్ట్రేషన్‌కు సగటున రూ.మూడు వేలు అనుకున్నా రూ.4,50,000 వరకు అవినీతి దందా నడుస్తోంది.
తీరు మారని అధికారులు
అడపాదడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు చేస్తున్నా అధికారుల తీరు మారడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా బాధితుడు అధికారులతో విసుగెత్తి ఏసీబీ అధికారులను కలిస్తే అప్పుడే మాత్రమే దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ల పనితీరుపై ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఫిర్యాదులు అందినే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటే ఈ అవినీతికి కాస్త అడ్డుకట్ట పడే అవకాశముందని ప్రజలు అంటున్నారు.
‘ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజు తయారుచేసినందుకు మాత్రమే రుసుం తీసుకోవాలి. ఎవరైనా అక్రమంగా వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
అవినీతికి అడ్డాగా జిల్లాలోని
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
కొంతమంది డాక్యుమెంట్ రైటర్లే దళారులుగా వ్యవహరిస్తూ వసూళ్లు
ఒక్కో డాక్యుమెంట్‌పై అదనంగా బాదుడు
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్‌పై
ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల నేపథ్యంలో చర్చ
‘స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే స్లాట్ బుకింగ్, దస్తావేజుల తయారీ మీద రూ.రెండు వేల వరకు డాక్యుమెంట్ రైటర్ తీసుకున్నాడు. ఇదికాకుండా దస్తావేజుకు, కార్యాలయ ఖర్చుల కోసమంటూ రూ.1,500ల వరకు వసూలు చేశాడు. అంటే మొత్తం రూ.3,500 వరకు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశాడు. రూ.లక్షలు పెట్టి ప్లాట్ కొనడంతో చకచక రిజిస్ట్రేషన్ కావాలన్న ఉద్దేశంతో రైటర్ అడిగినంత ఆ వ్యక్తి ఇచ్చేశారు.’
‘నాలా కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుంచి వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ వ్యక్తి రూ.ఆరు వేలు తీసుకున్నాడు. ఆ తర్వాతనే అతని పని పూర్తి అయింది. తన అవసరాల నిమిత్తం త్వరగా పని కావాలన్న ఉద్దేశంతో డాక్యుమెంట్ రైటర్ అడిగినంత ఆ వ్యక్తి ఇచ్చాడు’.


