కాశిబుగ్గ: పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ అన్నారు. ఎల్‌బీనగర్‌లోని అబ్నూస్ ఫంక్షన్‌లో హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ పాకిస్తాన్‌తో పోల్చి మాట్లాడటం బీజేపీ నాయకులకు సరైంది కాదని హెచ్చరించారు. గతంలో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టే తీసుకువచ్చిందని, మహిళలకు పెద్దపీట వేసి దేశానికి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసిన ఘతన కూడా కాంగ్రెస్ పార్టీదేనని కొనియాడారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మోడల్ స్కూల్స్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 160 మంది విద్యార్థులకు 113 మంది హాజరుకాగా 47 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కార్యాలయ ఏసీజీ భువనేశ్వరి తెలిపారు. అలాగే, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం మధ్యాహ్నం సెషన్‌లో నిర్వహించిన పరీక్షకు 114 మంది విద్యార్థులకు 67 మంది హాజరుకాగా.. 47 మంది గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు.
22 నుంచి సమ్మెకు సిద్ధం
నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జేబీఎం ఎలక్ట్రిక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉండి మోడీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసినా పట్టించుకోని పక్షంలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రవాణా కమిషనర్ చర్చలకు పిలిచిన యాజమాన్యం, ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదన్నారు. అధిక పని భారమైనప్పటికీ మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారన్నారు. కొందరు యాని యన్ నాయకులు, అధికారులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రీజియన్ జేఏసీ నాయకులు శ్రీనివాస్, యాకస్వామి, శ్రీనివాస్, జీఎస్.పాణి, మండరాజు, బాలరాజు, రమేశ్, పోతరాజు, వలీధర్, కుమార్, రవీందర్, అర్చన, కల్పన, నవత, ఉమారాణి, కవిత, సుమతి, కార్మికులు పాల్గొన్నారు.
మండే ఎండ..
ఠండా ఠండా!
న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌క్లోజర్‌లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.


