కేసీఆర్‌ పేరు వింటే రేవంత్‌కు దడ | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పేరు వింటే రేవంత్‌కు దడ

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌

వర్ధన్నపేట: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అంటే సీఎం రేవంత్‌రెడ్డికి దడ పుడుతోందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గ్రామంలో తొలుత కార్యకర్తలతో కలిసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన 30 మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ను తట్టుకోలేక రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నిక హామీల్లో కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఏమైందని, పింఛన్ల పెంపు ఏదని, విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని, రైతుబంధు ఎప్పుడు ఇస్తారని, రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీల సీట్లను కై వసం చేసుకుంటామని అరూరి రమేష్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, తూల్ల కుమారస్వామి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement