ఖిలా వరంగల్ మండలంలోని ఓ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న టి.భరత్‌తో పాటు బెట్టింగ్‌రాయుళ్లు ఎం.శ్రీనివాస్, ఎల్.వెంకన్న, పి.శ్రీధర్, వి.రమేశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,02,000 నగదు, ఐదు స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిర్వాహకుడు, ఇద్దరు బెట్టింగ్‌రాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు.
హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన గట్ల రాజేశ్ ఇంటిలో ఈనెల 10న ఐపీఎల్ ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అతడితో పాటు 11 మంది బెట్టింగ్‌రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,06,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, వరంగల్: ఐపీఎల్ వేళ బెట్టింగ్ నిర్వాహకులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు సరికొత్త పంథాలో అడ్డాలను ఎంచుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇళ్లు, హోటళ్లు, హాస్టళ్లు ఉంటే.. ఇప్పుడు పోలీసులు పెద్దగా దృష్టి సారించని స్విమ్మింగ్ పూల్స్, రిసార్ట్‌లు, ఫాంహౌస్‌ల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఖిలా వరంగల్ మండలంలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో శుక్రవారం రాత్రి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తితోపాటు నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించారు. ఎంజాయ్‌మెంట్ పేరుతో యువతను ఆకర్షించి బెట్టింగ్‌లోకి లాగుతున్నట్లు పోలీసులు దాడులతో తెలుస్తోంది. అయితే రిసార్ట్‌లు, ఫాంహౌస్‌లపై కూడా పోలీసులు దృష్టి సారిస్తే బెట్టింగ్‌ను నిలువరించవచ్చన్న డిమాండ్ వినిపిస్తోంది.
నిర్వాహకులకు కమీషన్, లాభాల్లో వాటా..
ఇన్‌స్ట్రాగామ్‌లో యాడ్స్‌గా వస్తున్న క్రిక్‌ఎక్స్‌బెట్.99.విన్, బీఎస్‌ఎఫ్2020.కామ్ తదితర క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల్లో నిర్వాహకులు కొందరు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందుతున్నారు. వీరికి ప్రతి బెట్టింగ్‌పై ఐదు నుంచి పది శాతం కమీషన్, అలాగే లాభాలను 70ః30 నిష్పత్తిలో ఇస్తున్నారు. వీరే బెట్టింగ్‌రాయుళ్లను ఒక ప్రదేశానికి రప్పించి వారి నుంచి డబ్బు తీసుకొని ఈ బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నారు. ప్రతి మ్యాచ్, ప్రతి బాల్‌పై కూడా లైవ్ యాడ్స్ చూపించి బెట్టింగ్ కాసేలా చూస్తున్నారు. ఇలా డిపాజిట్, బెట్టింగ్, ఫలితం, విత్ డ్రా నిమిషాల్లోనే ముగుస్తుంది. కొన్ని సైట్లు చిన్న మొత్తాలు చెలించి నమ్మకం కలిగించి పెద్ద మొత్తాలు పెట్టగానే వారి ఆశను క్యాష్ చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మ్యూల్ అకౌంట్ల ద్వారా చెల్లింపులు చేసి ట్రేస్ కాకుండా చూసుకుంటున్నారు. ఎక్కువ మంది బెట్టింగ్‌రాయుళ్లు ఓడిపోవడమే వారికి ప్రధాన ఆదాయ వనరుగా ఉందని పోలీసులు గుర్తించారు.
ఇళ్లు, హోటళ్లు కాదు..
ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ అడ్డా
ఖిలా వరంగల్ మండలంలో టాస్క్‌ఫోర్స్ దాడులతో వెలుగులోకి
ఎంజాయ్‌మెంట్ పేరుతో
యువకులకు వల.. ఆపై దందా


