వరంగల్ అర్బన్: మిద్దె తోటల (టెర్రాస్ గార్డెనింగ్)తో పచ్చదనం, ఆహ్లాదం, ఆరోగ్యం కలుగుతుందని, అందుకోసం బల్దియా ప్రోత్సాహం ఇస్తుందని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల పెంపకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మేయర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెర్రాస్ గార్డెనింగ్ వల్ల గాలిలోని హానికర వాయువులు నియంత్రణలోకి వస్తాయని పేర్కొన్నారు. మిద్దైపె సహజ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకోవడంతో ఆరోగ్యకర ఆహారం అందుబాటులోకి వస్తుందని, శుద్ధమైన గాలి లభిస్తుందన్నారు. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రత్యేకంగా ఉద్యానవన విభాగ సిబ్బందిని నియమించాలన్నారు. అనంతరం సీడీఎంఏ నుంచి వచ్చిన హార్టికల్చర్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బాలసముద్రం ప్రాంతంలో సీటీజీ సభ్యురాలు రాణి ఇంటి వద్ద నిర్వహిస్తున్న మిద్దె తోటను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర టెర్రస్ గార్డెన్ నోడల్ అధికారి హేమలత, రాష్ట్ర అర్బన్ ఫార్మింగ్ హార్టికల్చర్ అధికారి మంగ, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, రిటైర్డ్ ఎఫ్‌ఆర్‌ఓ పురుషోత్తం, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీనివాస్, నరేందర్, టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు, ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ గుండు సుధారాణి
పెంపకంపై అవగాహన సదస్సు


