ఇటీవల గీసుకొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి వైరల్ జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్లేట్‌లెట్లు పడిపోయాయంటూ భయాందోళనకు గురిచేసి నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంచారు. చివరకు రూ.70 వేల బిల్లు చేతిలో పెట్టారు.
సంగెం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలు చేసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. కాగా, అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నవి. దీంతో ఆమె ఆర్థికంగా నష్టపోయింది.
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంలో ప్రైవేట్ వైద్యం వ్యాపారంగా మారింది. కొన్ని ఆస్పత్రులు రోగులను ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నాయి. గ్రామీణుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చిన్నపాటి రోగానికి కూడా పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే, అత్యవసర విభాగంలో చేరిన వెంటనే అడ్వాన్స్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి, డిశ్చార్జ్ సమయంలో అసలు ఖర్చుకంటే రెట్టింపు బిల్లులు ఇస్తూ అందినకాడికి దోచుకుంటున్నాయనే విమర్శలున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడంతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కాస్త కాస్పత్రులుగా మారాయనే ఆరోపణలున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నా అధికారులు.. పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఆయా ఆస్పత్రులపై నిఘా ఉంచాల్సిన ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కాగా, వరంగల్ నగరంలో సుమారు 70 నుంచి 80 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి.
ల్యాబ్ పరీక్షల్లో వైద్యులకు వాటా
మల్టీ స్పెషాలిటీ పేరుతో నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు గ్రామీణుల నుంచి ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. కొంత మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలతో ల్యాబ్ నిర్వాహకులు కుమ్మక్కవుతున్నారు. అవసరం లేకపోయినా పలురకాల వైద్య పరీక్షలు చేయించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ల్యాబ్ ఫీజుల్లో 20 నుంచి 40 శాతం వరకు వారికి ల్యాబ్ నిర్వాహకులు కమీషన్ అప్పజెప్పుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబొరేటరీల నిర్వాహకులు అడ్డగోలుగా రోగులను దోచుకుంటుంటే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.
రక్తపరీక్షల పేరుతో దండుకునుడే..
జ్వరబాధితులు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే రక్త పరీక్షల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకోవాలంటే ప్రత్యేకంగా అనుమతులు పొందాలి. కానీ, చాలా ఆస్పత్రులు ఎలాంటి అనుమతి లేకుండానే ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. సాధారణ జ్వరమైనా అవసరం లేకపోయినా ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే ల్యాబొరేటరీల్లో స్కానింగ్, ఎక్స్‌రే, ఈసీజీ రక్తపరీక్షలు చేయించుకోవాలని ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. ఈ పరీక్షలకు రూ.వందలు, రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు. ఇక ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వాహకులు ప్రభుత్వ ఆస్పత్రులకు సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండానే కలెక్షన్ సెంటర్ల పేరుతో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
అధిక బిల్లులు వసూలు చేస్తే చర్యలు
అన్ని ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యుడి ఫీజు, ప్రతీ పరీక్షకు అయ్యే ఖర్చుల వివరాలను తెలిపే పట్టిక ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాం. అధిక ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నాం. రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలున్నాయి. వాటిని రోగులు వినియోగించుకోవాలి.
– డాక్టర్ సాంబశివరావు,
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
కొన్నిచోట్ల నిబంధనలకు తూట్లు
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో ఏ పరీక్షకు ఎంత ఫీజు తీసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాల పట్టికను అందరికి కనిపించేలా ఏర్పాటుచేయాలి. కానీ, జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినికల్ ల్యాబ్‌ల్లో ఎక్కడా ఫీజు వివరాలు పట్టికలు కనిపించవు. పైగా ఒక్కో రకం వైద్యానికి ఒక్కో ప్యాకేజీని నిర్ణయించి రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు.
రోగులను పీడిస్తున్న వరంగల్ నగరంలోని కొన్ని ఆస్పత్రులు
అవసరం లేకున్నా వైద్య
పరీక్షలు చేసి అడ్డగోలుగా ఫీజు వసూలు
జిల్లా వైద్య, ఆరోగ్య విభాగం దృష్టి సారిస్తేనే దందాకు అడ్డుకట్ట


