భవితకు ‘ఆదర్శ’మార్గం | - | Sakshi
Sakshi News home page

భవితకు ‘ఆదర్శ’మార్గం

Feb 20 2026 6:25 AM | Updated on Feb 20 2026 6:25 AM

భవితక

భవితకు ‘ఆదర్శ’మార్గం

సంగెం: ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ఆదర్శ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ఆంగ్ల మాద్యమంలో విద్యనందించి ఉత్తమంగా తీర్చిదిద్దుతోంది. దీంతో మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు డిమాండ్‌ పెరిగింది. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహించి మెరిట్‌ మార్కుల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో వంద మంది విద్యార్థులకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో గవిచర్ల, వంచనగిరి, అమీనాబాద్‌, పర్వతగిరి, బుధరావుపేట, నెక్కొండలో 2013లో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది.

దరఖాస్తులు ఇలా..

ఆరో తరగతితోపాటు ఇతర తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకోసం ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వెట్‌సైట్‌ http://telanganams.cgg.gov. in లో విద్యార్థుల ఆధార్‌కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల బోనఫైడ్‌, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజ్‌తో దరఖాస్తులు చేసి పత్రాలను సంబంధిత మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఓసీలు రూ.200, బీసీ, ఎస్సీ,ఎస్టీలు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్‌ 19వ తేదీన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.

పరీక్ష విధానం..

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అబ్జెక్టివ్‌ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు.. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఐదో తరగతి సిలబస్‌, మిగతా తరగతుల విద్యార్థులకు ప్రస్తుతం చదువుతున్న తరగతుల నుంచి తెలుగు, గణితం, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు 50, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 35 మార్కులు సాధిస్తేనే పాస్‌గా పరిగణిస్తారు.

రిజర్వేషన్లు..

ప్రతీ తరగతిలో 15 శాతం ఎస్సీలకు, ఎస్టీలకు 6, బీసీలకు 29 శాతం, (బీసీ ఏ–7, బీ–10, సీ–1, డీ–7, ఈ–4శాతం), దివ్వాంగులకు 3 శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించారు. ని ర్ధేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేని పక్షంలో ఇతర గ్రూపుల నుంచి భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం ఇతర కులాలకు ఓపెన్‌ కేటగిరీలో నిర్ధేశించారు.

మండలానికే తొలిప్రాధాన్యం

6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించాం. 7 నుంచి 10వ తరగతిలో ఖాళీ సీట్లు కూడా భర్తీ చేస్తాం. ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం లభిస్తున్నది. ఆంగ్ల మాద్యమంతో విద్యార్థుల భవిష్యత్‌ బాగుంటుంది. మండల పరిధిలోని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత. లోకల్‌ వారు లేకుంటే ఇతర మండలాల వారికి అవకాశం కల్పిస్తాం.

– ప్రసన్నలక్ష్మి, ప్రిన్సిపాల్‌, గవిచర్ల మోడల్‌ స్కూల్‌

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు

పెరుగుతున్న పోటీ

ఈనెల 28వరకు దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్‌ 19న ప్రవేశ పరీక్ష

6నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం

జిల్లాలో 6 మోడల్‌ స్కూళ్లు

మోడల్‌ స్కూల్‌ ప్రత్యేకతలు..

6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాద్యమంలో డిజిటల్‌ బోధన, ఉత్తమ ఫలితాల సాధన

పక్కా భవనంలో సరిపడా తరగతి గదులు

ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ

అనుభవజ్జులైన ఉపాధ్యాయులతో బోధన

విశాలమైన ఆటస్థలం, సెన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌తోపాటుగా లైబ్రరీ సదుపాయం

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ద్వారా రోబోటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ

ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులకు శిక్షణ

నాణ్యమైన పౌష్టికమైన మధ్యాహ్న భోజనం, మినరల్‌ వాటర్‌

8వ తరగతి విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనాల కోసం ప్రత్యేక శిక్షణ

పదో తరగతి విద్యార్థులకు ఎన్‌టీఎస్‌ఏకు ప్రత్యేక శిక్షణ తరగతులు

వృత్తివిద్యా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బ్యూటీషన్‌ కోర్సుల్లో శిక్షణ

విద్యార్థులకు సాంస్కృతిక, క్రీడా, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణ

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అమ్మాయిలకు హాస్టల్‌ వసతి

భవితకు ‘ఆదర్శ’మార్గం1
1/1

భవితకు ‘ఆదర్శ’మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement