ప్రైవే2 చేతుల్లోకి డిపో
గురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపో త్వరలో పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లనుంది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వరంగల్ రీజియన్‌కు మంజూరు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు వరంగల్–2 డిపోకు కేటాయించారు. ఈ బస్సుల్లో కొన్నింటిని ఇతర డిపోలకు సర్దుబాటు చేశారు. మిగిలిన బస్సులను సైతం ఈ నెలాఖరువరకు ఇతర డిపోలకు పంపి ఖాళీ చేయనున్నారు. దీంతో వరంగల్–2 డిపో పూర్తిగా ప్రైవేట్ సంస్థ జేబీఎం చేతుల్లోకి వెళ్లనుంది. 2025 జనవరి నాటికి వరంగల్–2 డిపోలో 69 ఆర్టీసీ సొంత బస్సులు, 44 అద్దె బస్సులు నడిచేవి. 2024 డిసెంబర్‌లో వరంగల్‌కు రీజియన్‌కు కేటాయించి 112 ఎలక్ట్రిక్ బస్సులు వరంగల్–2 డిపోకు చేరుకున్నాయి. జనవరిలో ఈ బస్సుల రవాణా సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు తిరిగిన ఆర్టీసీ సంస్థ సొంత బస్సుల్లో కొన్నింటిని వరంగల్–1, హనుమకొండ డిపోకు సర్దుబాటు చేశారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు 12 సొంత బస్సులు, 44 అద్దె బస్సులను వరంగల్–2 డిపో నడుపుతోంది. అయితే తమకు స్థలం సరిపోవడం లేదని, ఒప్పందం మేరకు తమకు డిపో మొత్తం పూర్తిగా అప్పగించాలని జేబీఎం అర్టీసీ అధికారులపై ఒత్తిడి పెంచింది. దీంతో డిపోను వారికి పూర్తి స్థాయిలో అప్పగించేందుకు వరంగల్ రీజియన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
డ్రైవర్లను బట్టి బస్సుల కేటాయింపు..
డిపోను జేబీఎం సంస్థకు అప్పగిస్తున్న క్రమంలో ప్రస్తుతం నడుస్తున్న సంస్థ బస్సులను ఇతర డిపోలకు సర్దుబాటు చేయాల్సిన అవసరముంది. ఈ మేరకు ముందుగా డ్రైవర్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు డ్రైవర్ల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. దాదాపుగా నగరంలోని మరో రెండు డిపోలైన వరంగల్–1, హనుమకొండ డిపోకు డ్రైవర్లు వెళ్లే అవకాశముంది. ఈ డ్రైవర్ల సంఖ్యను బట్టి ఆయా డిపోలకు 12 బస్సులను కేటాయించనున్నారు. అద్దె బస్సులు 44 ఉన్నప్పటికీ వాటి పార్కింగ్, నిర్వహణ, మరమ్మతులు అద్దె బస్సుల యజమానులు చూసుకుంటున్నారు. దీంతో వీటిని వరంగల్–2 డిపో ఆధ్వర్యంలోనే నడుపనున్నారు.
స్థలం సరిపోక..
ప్రస్తుతం వరంగల్–2 డిపో ద్వారా 112 ఎలక్ట్రిక్ బస్సులు రవాణా సేవలు అందిస్తున్నాయి. మెదక్ రీజియన్‌కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులు అక్కడ అవసరం లేకపోవడంతో ఈ క్రమంలో మూడు ఎలక్ట్రిక్ బస్సులను వరంగల్ రీజియన్‌కు ఇవ్వడంతో వాటిని కూడా వరంగల్–2 డిపోకు కేటాయించారు. దీంతో మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 115కు చేరింది. దీంతో ఈ బస్సుల సంఖ్య పెరగడం, ఆర్టీసీ బస్సులు కూడా డిపోలోనే ఉండడంతో స్థలం సరిపోవడం లేదని జేబీఎం సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకే గ్యారేజీలో సంస్థ బస్సులు, జేబీఎం బస్సులు మరమ్మతు, నిర్వహణ పనులు చేయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం వరంగల్–2 డిపోను పూర్తిగా జేబీఎంకు అప్పగిస్తోంది.
WGL-2
BUS DEPOT
JBM
ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారుల నిర్ణయం
టేకోవర్ చేయనున్న జేబీఎం.. ఖాళీ కానున్న బస్సులు
ఇతర డిపోలకు డ్రైవర్ల సర్దుబాటు..
ఆప్షన్లు కోరిన అధికారులు
కేటాయింపునకు అనుగుణంగా బస్సుల సర్దుబాటు


