పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
● హనుమకొండ, వరంగల్
కలెక్టర్లు స్నేహ శబరీష్,
సత్యశారద
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 18,590 మంది, ద్వితీయ సంవత్సరం 20,004 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 14నుంచి నిర్వహించనున్న టెన్త్ వార్షిక పరీక్షలకు జిల్లాలో 64 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 12,079 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్, ఇంటర్ విద్యాధికారి గోపాల్, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో..
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఈనెల 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఐఈఓ శ్రీధర్‌సుమన్ మాట్లాడుతూ.. జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు.. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,210 మంది, ఒకేషనల్ విద్యార్థులు 793 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ 5,356 మంది, ఒకేషనల్ 807 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 92402 05555కు ఫోన్ చేయాలని కోరారు.


