ఎంత ఖర్చు చేసినా గెలవకపాయె!
సాక్షి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో రూ.లక్షల్లో ఖర్చు చేసి ఓడిపోయిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కక్కలేక మింగలేని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో పదవులు దక్కించుకోవాలన్న ఆతృతతో ఉన్న ప్లాట్లు, భూములు అమ్మి వచ్చిన డబ్బులతోపాటు అప్పులు తెచ్చి ఓటర్లకు పంచిన నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వెళ్లి అడుగుదామంటే ఓటర్ల దృష్టిలో పరువుపోయే పరిస్థితి. ఓటమితో వచ్చిన బాధ కంటే ఇప్పుడు అప్పులు ఎలా తేర్పాలన్న టెన్షన్ ఓడిపోయిన అభ్యర్థులకు పట్టుకుంది. ఇలాంటి వారు చాలా మంది ఓటమి తర్వాత ఇళ్ల నుంచి బయటకురాలేక లోలోపల కుమిలిపోతున్నారు.
ఓడిన అభ్యర్థులు ఖర్చు చేసింది
రూ.20 కోట్లపైనే..
జిల్లాలోని నర్సంపేటలో 30 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులు ఉన్నాయి. మొత్తం 42 వార్డుల్లో 170 మంది పోటీ చేశారు. వీరిలో 42 మంది గెలవగా, 128 మంది ఓటమి చెందారు. ఇందులో దాదాపు 86 మంది రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ముగ్గురు ఇండిపెండెంట్లతోపాటు ప్రధాన పార్టీలకు చెందిన మిగిలిన 81 మంది రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు, ఆపైన ఖర్చు చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కేవలం గెలవని అభ్యర్థులే రూ.20 కోట్ల వరకు వెచ్చించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పైసలు పోయినా మంచిదే పదవి దక్కితే చాలు అని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలతోపాటు ముగ్గురు స్వతంత్రులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. కరపత్రాలు మొదలు మందు, బిర్యానీ ఇతర ఖర్చులకు వెచ్చించారు. ప్రణాళిక ప్రకారం డబ్బులు వెచ్చించడం తెలియక, రాజకీయ అనుభవం లేక చాలామంది ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ
170 మందిలో 42 మంది అభ్యర్థులే విజయం
చేసిన అప్పులు తీర్చేదెలాగో తెలియక ఆందోళన
నర్సంపేటలోని ఓ ముఖ్యమైన వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెట్టారు. తెల్లారితే పోలింగ్ అనగా ఒకరిని మించి మరొకరు అక్కడి ఓటర్ల ప్రాధాన్యతను బట్టి రూ.3,000 నుంచి రూ.5,000 వరకు పంపిణీ చేశారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో తమ సామర్థ్యానికి మించి రూ.లక్షల్లో అప్పులు తెచ్చి మరీ ప్రజలకు ఇచ్చారు. అయితే గెలిచిన అభ్యర్థికి సంతోషమున్నా... ఓడిన ఇద్దరికి చేసిన అప్పులు ఎలా తేర్పాలన్న బాధ పట్టుకుంది.
వర్ధన్నపేటలోని ఓ వార్డులో పార్టీ టికెట్ దక్కించుకున్న ఓ అభ్యర్థి తనకున్న ప్లాట్‌ను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులను ప్రచారం, మద్యానికి ఖర్చు పెట్టారు. ఓట్లరకు పంపిణీ చేసే సమయంలో డబ్బులు చాలకపోవడంతో తెలిసినవారి నుంచి రూ.10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. ఇప్పుడు ఓడిపోవడంతో లబోదిబోమంటున్నాడు.
ఎంత ఖర్చు చేసినా గెలవకపాయె!


