చిత్తడి నేలలను పరిరక్షించాలి
● సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: చిత్తడి నేలల పరిరక్షణ, అభివృద్ధిలో పరస్పర సమన్వయం అవసరమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. జిల్లా అటవీశాఖాధికారి అనూజ్ అగర్వాల్ మెంబర్ కన్వీనర్‌గా పాల్గొన్న గత సమావేశం అనంతరం జరిగిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన రెండు వెట్‌ల్యాండ్స్‌కు సంబంధించిన కీలక సమాచారం, పత్రాలు వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు డీఎఫ్‌ఓ వివరించారు. ముసలమ్మకుంట (వరంగల్ రేంజ్), వెంకటాపూర్ పెద్దచెరువు (నర్సంపేట రేంజ్)కు సంబంధించిన రెవెన్యూ, సాగునీరు, మత్స్య, పర్యాటక శాఖల నుంచి అవసరమైన నివేదికలు అందాల్సి ఉన్నట్లు తెలిపారు. వెట్‌ల్యాండ్స్‌కు సంబంధించి పత్రాలు, సంబంధిత శాఖల సమ్మతి పత్రాలు త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పర్యటించి పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘సర్’పై సమీక్ష
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్‌పై కలెక్టరేట్‌లో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, తహసీల్లార్లు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మ్యాపింగ్ ప్రకియను వేగవంతం చేయాలని సూచించారు.
సేంద్రియ సాగుపై శిక్షణ ఇవ్వాలి
ఖిలా వరంగల్: సేంద్రియ సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు అనురాధతో కలిసి వ్యవసాయ విస్తరణ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్, క్రాప్‌బుకింగ్ యూరియా నిల్వలు, విక్రయాలు, రైతుబీమా, ఇతర పథకాలపై కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ విస్తరణాధికారులు సర్వేనంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని, పెండింగ్ రైతుల వివరాలు సేకరించి ఐడీ క్రియేట్ చేయాలన్నారు.


