నర్సంపేటలో డంపింగ్ యార్డు సమస్య
నర్సంపేట గ్రామ పంచాయతీ 2011లో నగర పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్నతీకరణ చెందింది. పట్టణంలో 60 వేల జనాభాతోపాటు 41 వేల మంది ఓటర్లు ఉన్నారు. చెత్త డంపు సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మల్లంపల్లి వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న అసైన్‌మెంట్ భూమిలో ఓ వ్యక్తి అక్రమంగా మట్టిని తరలించడంతో ఏర్పడిన గుంతలో చెత్తను వేశారు. దీంతో పట్టణ సమీప ప్రజలు అభ్యంతరాలు చెప్పడంతో పాకాల రోడ్డులో చెత్తను డంపు చేస్తున్నారు. ఇక్కడ 3,500 మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉంది. ఈ స్థలంలో చెత్తను తగులబెట్టడంతో పొగ వెదజల్లుతోంది. రాకపోకలు సాగించే వాహనదారులో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదు సంవత్సరాలుగా చెత్తను డంపు చేస్తున్నా గత పాలకవర్గం పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానం..
నర్సంపేట పట్టణంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు, పాదచారులకు పాట్లు తప్పడం లేదు. డ్రెయినేజీలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పలు కాలనీల్లో పైపులైన్ లీకేజీలతో నీరంతా మురుగు కాల్వల్లో కలుస్తోంది. నూతన పాలకవర్గం దృష్టిసారించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
త్వరలోనే సమస్య పరిష్కారం..
నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రధాన సమస్య చెత్త డంపు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. బయోమైనింగ్ మిషన్ ద్వారా చెత్తలో ఉన్న రకరకాల వ్యర్థాలను వేరుచేస్తూ.. దుర్వాసన రాకుండా యంత్రాలను సమకూర్చుకుంటున్నాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం.
– పెండెం శ్రీలక్ష్మీరామానంద్, నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్
నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో డంపుచేసిన చెత్త
నర్సంపేటలో డంపింగ్ యార్డు సమస్య


