మెరిసిన ఆరెపల్లె..!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఆరెపల్లె గ్రామపంచాయతీ బాలల స్నేహపూర్వక పంచాయతీ (చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ (సీఎఫ్‌పీ))గా రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2023–24 సంవత్సరానికి గాను ఈ గుర్తింపును గ్రామం సాధించినట్లు తాజాగా పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచిక పేర్కొంది. రాష్ట్రస్థాయిలో గ్రామం ప్రశంసనీయమైన 89.95 సూచీ సాధించింది. దీంతో జాతీయ పంచాయతీ అవార్డులు –2025 కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామం పేరును కేంద్రానికి నామినేట్ చేసింది. పంచాయతీ ఇండెక్స్ (పీఏఐ) కింద మొత్తం 9 విభాగాల్లో జాతీయ అవార్డుల కోసం ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ప్రతీ విభాగంలో రాష్ట్రం నుంచి ఒక్కో గ్రామ పంచాయతీని జాతీయ అవార్డు కోసం ఎంపిక చేసి పంపించగా, వాటిలో ఆరెపల్లి గ్రామం స్నేహపూర్వక పంచాయతీగా నిలిచింది. గ్రామానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్పంచ్ తుమ్మనపెల్లి స్వప్న, పంచాయతీ కార్యదర్శి నల్లెల్ల స్వప్న హర్షం వ్యక్తం చేశారు. కాగా, గ్రామాన్ని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వెస్లీ, కలెక్టర్ సత్యశారద మంగళవారం వేర్వేరుగా సందర్శించారు. గ్రామంలోని అంగన్‌వాడీ, పూర్వ ప్రాథమిక పాఠశాలలో బాలలకు అందుతున్న పౌష్టికాహారం, వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రం, శానిటేషన్, నర్సరీలను పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని, అన్ని రికార్డులు సరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో కేంద్ర బృందం గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉందని వెస్లీ చెప్పారు.
రాష్ట్ర స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ
పంచాయతీగా గుర్తింపు
జాతీయ పంచాయతీ అవార్డు కోసం నామినేట్
గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, పంచాయతీ రాజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్


