అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
కమలాపూర్: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఉపాధ్యాయులకు సూచించారు. గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ముఖగుర్తింపు విధానంలో హాజరు నమోదును పరిశీలించారు. ఆరు, పదో తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. లెట్స్ ఎన్‌రిచ్ అవర్ ఇంగ్లిష్ పాఠ్యాంశ బోధనను పరిశీలించి ఆంగ్ల ప్రావీణ్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతులను పరిశీలించిన కలెక్టర్ ఐదో తరగతి విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడించారు. పాఠశాలలో అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. తరగతి గదులు ఉన్నా విద్యార్థులను బయట కూర్చోబెట్టడం సరికాదని హెచ్చరించారు. పాఠశాల వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై కూడా కలెక్టర్ ఆరా తీసి మాట్లాడారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ప్రత్యేక దృష్టి సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీడీఓ గుండె బాబు, ఎంఈఓ శ్రీధర్, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


