రూ.50 వేలు ఇస్తే.. రూ. 2 వేల కమీషన్
● క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోగానే వెంటనే ఇస్తామని బురిడీ..
● పెట్రోల్ పంపుల్లో మోసాలకు పాల్పడతున్న ఇద్దరి అరెస్ట్
● నిందితుల వివరాలు వెల్లడించిన పోలీసులు
కమలాపూర్: రూ.50 వేలు ఇస్తే.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోగానే వెంటనే రూ. 2 వేలు కమీషన్ ఇస్తామని చెబుతూ పెట్రోల్ పంపుల్లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం కమలాపూర్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌కు చెందిన రాపోలు శ్రీనివాస్, ఏపీలోని కాకినాడకు చెందిన చింతాడ సాయికుమార్ ఈ నెల 3వ తేదీన కమలాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో పని చేస్తున్న జక్కు రాజ్‌కుమార్ దగ్గరకు వచ్చారు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలి, డబ్బులు ఇస్తే చెల్లించి తిరిగి ఇస్తామని నమ్మించి రూ.50 వేలు అడిగారు. అందుకు రూ.2 వేలు కమీషన్ అవుతుందని రాజ్‌కుమార్ చెప్పగా అందుకు ఒప్పుకుని రాజ్‌కుమార్‌కు క్రెడిట్ కార్డు అని చెప్పి వేరొకరి పేరుపై ఉన్న డెబిట్ కార్డు ఇచ్చారు. దీంతో రాజ్‌కుమార్.. శ్రీనివాస్‌కు మొదట రూ.వెయ్యి నగదు ఇవ్వగానే అవి తీసుకుని ఆటోలో వెళ్లిపోగా ఆ తర్వాత శ్రీనివాస్ ఇచ్చిన సాయికుమార్ నంబర్‌కు ఐదు సార్లు మొత్తం రూ.49 వేలు ఫోన్‌పే చేయగానే ఆ డబ్బులను శ్రీనివాస్, సాయికుమార్ ఇద్దరు కలిసి శ్రీలంక–ఇంగ్లండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు బెట్టింగ్ పెట్టి నష్టపోయారు. తాను ఇచ్చిన డబ్బుల కోసం రాజ్‌కుమార్ వారికి పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం కమలాపూర్ భారత్ పెట్రోల్ పంపు వద్ద శ్రీనివాస్, సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. శ్రీనివాస్‌పై ఇప్పటికే నెక్కొండ, పర్వతగిరి, లింగాలఘణపురం, వర్ధన్నపేట, రఘునాథపల్లి, పరకాల, సుబేదారి తదితర పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయని, మొత్తంగా క్రెడిట్ కార్డు పేరుతో శ్రీనివాస్ మోసాలకు పాల్పడి రూ.8.88 లక్షలు కాజేశాడని తెలిపారు. ఖమ్మం జైలులో ఉన్నప్పుడు శ్రీనివాస్‌కు సాయికుమార్‌తో పరిచయం ఏర్పడిందని, జైలు నుంచి విడుదలయ్యాక కమలాపూర్‌లో మోసానికి పాల్పడ్డారని తెలిపారు. క్రెడిట్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఇన్‌స్పెక్టర్ నవీన్, ఎస్సై దిలీప్, కానిస్టేబుళ్లు ఉదయ్, భాస్కర్‌ను ఏసీపీ అభినందించారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వివిధ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీకాన్ఫరెన్‌్స్ హాలులో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారితో కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. వైద్యాధికారులు, సంబంధిత సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ ఎ.అప్పయ్య, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతంచౌహన్ తదితరులు పాల్గొన్నారు.


