నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి
● కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల
పరిశీలన, ప్రత్యేక పూజలు
● సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ
భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైప్‌లైన్ ఏర్పాటు, భీంఘన్‌పూర్ రిజర్వాయర్ ఆధునీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది.
ఏర్పాట్లు పూర్తి..
సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను శనివారం పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భారీ బందోబస్తు..
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: వేసవిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతేడాదిలో తాగునీటి సమస్యలు ఎదురైన గ్రామాలు, తీసుకున్న పునరుద్ధరణ చర్యలు, జిల్లాకు అవసరమైన నీటి సామర్థ్యం, నీటి వనరుల స్థితిగతులపై అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర నివేదికను మిషన్ భగీరథ ఈఈలు, జిల్లా పంచాయతీ అధికారి త్వరితగతిన అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు ప్రతీ ఇంటికి తాగునీరు అందుతుందా లేదా? అని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, ఈఈ రామాంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ డీఈలు, ఏఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి


