ప్రణాళికా విభాగం..
పూర్తిస్థాయి సిటీప్లానర్ లేక ఇబ్బందులు
పనితీరు నిస్తేజం!
వరంగల్ అర్బన్: మహా నగరాభివృద్ధి దశదిశను నిర్దేశించే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అత్యంత కీలకమైన ప్రణాళిక విభాగానికి పూర్తిస్థాయి సిటీప్లానర్ లేక భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఏడాదిన్నర క్రితం పాలకవర్గం పెద్దల ఒత్తిడి తాళలేక సిటీప్లానర్ శైలజ హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి డిప్యూటీ సిటీప్లానర్.. ఇన్‌చార్జ్ సిటీప్లానర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రణాళికా విభాగం పనితీరు నిస్తేజంగా మారింది. కిందిస్థాయి నుంచి వేళ్లూనుకున్న అవినీతి సర్వసాధారణమైంది. ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కీలక నగరం ఇలా..
రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో రహదారుల విస్తరణ, అభివృద్ధికి బృహత్ ప్రణాళికలు, ఇంటి నిర్మాణాలు, బహుళ అంతస్తులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫైర్‌సేఫ్టీ ఇలా ఏదైనా నిర్మించుకోవాలంటే కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి పొందాల్సిందే. మార్ట్‌గేజ్ రిలీజ్, లేఔట్ల అనుమతులు, ప్రకటనలు, వాటి నుంచి పన్నుల వసూలు, ఖాళీ స్థలాల పరిరక్షణ, ఫైర్ సేఫ్టీపై ఇలా ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి.
భవనాల నిర్మాణదారులతో కుమ్మక్కు..
నగరంలో నూతన భవనాలను నిబంధనల మేరకు నిర్మిస్తున్నారా లేదా? అని పరిశీలించే సిబ్బంది ముడుపులకు కక్కుర్తిపడి మిన్నకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విభాగానికి ఏటా సుమారు 3వేల వరకు దరఖాస్తులు వస్తుంటాయి. నిబంధనల ప్రకారం ప్లాన్ స్థలం, సర్వేయర్లు కొలతలు వేసిన తర్వాత అనుమతులివ్వాలి. అనంతరం ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతుందా అని పూర్తయ్యే వరకు పనులు పర్యవేక్షించాలి. 200 చదరపు మీటర్లకు పైగా ఉన్న స్థలంలో నిర్మాణాలు జరుగుతంటే మాత్రం ఆ స్థలంలో 10 శాతం బల్దియా కమిషనర్ పేరిట రిజిస్టర్ చేయాలి. భవన నిర్మాణం పూర్తయితే ఆ తర్వాత విడుదల చేస్తారు.
నగరంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు
పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతుల దగ్గర నుంచి నిర్మాణం వరకు కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 100 మీటర్ల నుంచి 200 మీటర్ల మేరకు ఉన్న స్థలంలో మూడు అంతస్తుల నిర్మాణానికి అధికారులు అనుమతిస్తారు. కానీ, నిర్మాణంలో 10 శాతం తనాఖా పెట్టాల్సి ఉంటుంది. 300 నుంచి 500 మీటర్లలోపు స్థలంలో నాలుగు అంతస్తులు, 12 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణానికి అధికారులు అనుమతిస్తారు. 500 మీటర్ల నుంచి 1,000 మీటర్ల వరకు ఖాళీ స్థలానికి 8 అంతస్తుల వరకు నిర్మాణాలకు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే భవనాల చుట్టూ ఖాళీ స్థలం (సెట్ బ్యాక్) వదలడం లేదు. అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్, బహుళ అంతస్తుల నిర్మాణాలపై పెంట్‌హౌస్‌ల స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఇంటి నిర్మాణాలు సాగుతున్నాయి. ఫైర్‌సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయడం లేదు. పార్కింగ్ కోసం నిర్మించే సెల్లార్లలో కూడా గదులు నిర్మిస్తున్నారు. దీంతో వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో సైడ్ కాల్వలు, రోడ్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తున్నారు. సైడ్ కాల్వలు కుదించి వాటి మీద ర్యాంపులు, ఫోర్టికోలు, మెట్లు నిర్మిస్తుండడంతో వర్షాకాలంలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఏవి?
అనుమతి లేని కట్టడాలను ఆదిలోనే అడ్డుకునేలా జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక ఎన్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్)బృందాలను ఏర్పాటు చేసి డిప్యూటీ కమిషనర్లు బాధ్యులుగా వ్యవహరించాలి. 20 రోజులకోసారి ఆయా డివిజన్లలో తనిఖీ చేయాలి. అనుమతి లేని నిర్మాణాల పూర్తి సమాచారం సేకరించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చేర్చాలి. కానీ, అవేమి బల్దియాలో లేవు. ఈ విషయమై బల్దియా ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ వాడేకర్‌ను వివరణ కోరగా అనధికారిక నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని, ఇవి మా దృష్టికి ఏమి రాలేదని పేర్కొన్నారు.
విభాగంలో వేళ్లూనుకుంటున్న అవినీతి
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
ప్రణాళికా విభాగం..


