ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కుట్ర
దుగ్గొండి: వలసలను నిరోధించి, పేదల కడుపు నింపడానికి యూపీఏ –1 ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు విమర్శించారు. మండలంలోని తొగర్రాయి గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2005లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి రూపకల్పన చేసిందని గుర్తుచేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఉపాధి పథకం ద్వారా సుమారు 27 కోట్ల కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని చెప్పారు. ఈ క్రమంలో ప్రజల్లో పాతుకుపోయిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను రద్దు చేసి వారి మదిలో నుంచి తొలగించాలని కుట్రపూరితంగా నూతనంగా జీరామ్‌జీ ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోందని విమర్శించారు. ఇది పరోక్షంగా ఉపాధి పథకాన్ని తీసివేయడమేనని సునీతారావు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, అల్లూరి కృష్ణవేణి, మౌనిక, జాతీయ కార్యదర్శి మయూర్ సింగ్, కోతి మమత, బుర్రి సునీత, వెండి సక్కుబాయి, శాంత, తదితరులు పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు


