62.36% | - | Sakshi
Sakshi News home page

62.36%

Dec 26 2025 8:04 AM | Updated on Dec 26 2025 10:20 AM

62.36

62.36%

ధాన్యం సేకరణ

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

వానాకాలం సేద్యం రైతులకు అచ్చి రాలేదు. పరిస్థితులు అనుకూలించి అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పంట వేసింది మొదలు చేతికందే వరకు వరుస వర్షాలు కురవడం, పైరుకు తెగుళ్లు సోకడంతో ఈ సీజన్‌లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు అంచనాల మేరకు ధాన్యం రాలేదు. కేంద్రాలు మూసివేసే దశకు చేరినా.. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నాటికి ధాన్యం సేకరణ 62.36 శాతానికే చేరింది. 10.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికీ 6.48 లక్షల మెట్రిక్‌ టన్నులే సేకరించారు.

ధాన్యం సేకరణ అంచనాలు తారుమారు..

వానాకాలంలో సీజన్‌లో ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా 15.83 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 8,78,376 ఎకరాల్లో వరి వేస్తారని భావించగా, ఎనిమిది లక్షల ఎకరాల వరకు సాగైనట్లు అధికారులు ప్రకటించారు. 10,39,815 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్‌, సివిల్‌సప్లయీస్‌ కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రతిపాదించింది. కొనుగోలు సీజన్‌ ప్రారంభం కాగానే ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లో 1,360 కేంద్రాలను తెరిచారు. కొనుగోళ్లు మందకొడిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకుంటాయని భావించారు. కానీ, ఈ నెల 24వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతులనుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 85.59 శాతం సేకరణ జరగ్గా, అత్యల్పంగా జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలో 40.42 శాతంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల సరసన నిలిచే ఉమ్మడి వరంగల్‌లో ఈసారి ధాన్యం దిగుబడి, సేకరణ గణనీయంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

దిగుబడిపై అకాలవర్షాలు, తెగుళ్ల ప్రభావం..

వానాకాలం ధాన్యం దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు అకాల వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, పంటలకు సోకిన తెగుళ్లు (కాటుక), యూరియా కొరతగా రైతులు చెబుతున్నారు. వీటి వల్ల వరి పంట నీట మునగడం, మొలకెత్తడం, గింజ రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి గణనీయంగా తగ్గిందని, రైతులు నష్టపోయారని అధికారులు సైతం అంటున్నారు. ఇదే సమయంలో పైరుకు ‘కాటుక’ వంటి తెగుళ్లు సోకడం వల్ల మొత్తంగా ఉత్పత్తి 40 శాతం వరకు తగ్గిందని, ఇందుకు కొన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన నివేదికలే ఉదాహరణగా చెబుతున్నారు.

మోంథా తుపాను నిండా ముంచింది

మోంథా తుపాను ప్రభావంతో వరి ఈసారి ఆశించినంత దిగుబడి రాలేదు. సకాలంలో యూరియా కూడా అందకపోవడం పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. నాకున్న ఐదు ఎకరాల్లో వరినాటు వేస్తే 78 బస్తాలు వడ్లు పండాయి. వర్షాలతో వరి నేలకొరగడంతో చేను కోయడానికే మిషన్‌ ఖర్చులు రూ.24 వేలు అయ్యాయి. దీనికితోడు పొలం దున్నడం, నాటు, ఎరువులకు, ఇతరత్రా ఖర్చులు పోను ఏమీ మిగల్లేదు.

– హింగే మనోహర్‌, రైతు, పీచర, వేలేరు

సగానికి సగం దిగుబడి తగ్గింది

పోయిన వానాకాలం నాకున్న రెండెకరాలకు తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి పంటేసిన. ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అనుకున్న. కానీ పంట చేతికొచ్చే దశలో కురిసిన అకాల, భారీ వర్షాల కారణంగా దిగుబడి సగానికి సగం తగ్గిపోయి ఎకరానికి సుమారు 15 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చింది. పంట చేతికొచ్చే దశలో కురిసిన వర్షాలు రైతులను ఆగం చేశాయి.

– వడ్డె వీరయ్య, కమలాపూర్‌ రైతు

జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ ఇలా..(ధాన్యం మెట్రిక్‌ టన్నుల్లో)

జిల్లా సేకరించాల్సిన కేంద్రాల కేంద్రాల కొనుగోలు రైతుల విలువ

ధాన్యం ప్రతిపాదన ప్రారంభం ధాన్యం సంఖ్య (రూ.కోట్లలో)

హనుమకొండ 1,80,355 157 157 1,03,154 25754 246.39

వరంగల్‌ 1,95,141 260 260 1,15,440 28604 275.77

జనగామ 1,69,662 294 294 1,45,206 36274 346.87

మహబూబాబాద్‌ 2,24,688 260 260 1,54,520 31334 369.06

భూపాలపల్లి 1,22,543 204 204 49,356 9616 117.89

ములుగు 1,47,426 185 185 80,702 11775 192.21

ఉమ్మడి జిల్లా రైతులకు అచ్చిరాని వానాకాలం సాగు

10.40 లక్షల టన్నులు సేకరణ లక్ష్యం.. 1,360 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఇప్పటివరకు వచ్చింది 6.48 లక్షల మెట్రిక్‌ టన్నులే

కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం.. దిగుబడి తగ్గడమే కారణం

రైతులను ముంచిన అకాలవర్షం.. మొదలైన యాసంగి సీజన్‌

62.36%1
1/2

62.36%

62.36%2
2/2

62.36%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement