వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య
ఆత్మకూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా క్లినిక్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆరోగ్య సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యాధికారులను సంప్రదించాలని కోరారు. ఇక్కడ నుంచి ఎవరినైనా రెఫర్ చేసినప్పుడు తగిన ఫాలోఅప్ సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సంవత్సరం 1,560 మహిళలను పరిశీలించి 350 మందికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, 82 మందిని రెఫర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రెఫర్ చేసిన వారికి తగిన ఫాలోఅప్ సేవలందించాలని డాక్టర్ స్పందనను ఆదేశించారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు లెప్రసీ నిర్ధారణ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ స్పందన, డాక్టర్ పుష్పలీల, సిబ్బంది పాల్గొన్నారు.


