ప్రజల ఆశీర్వాదం ఉంటేనే గెలుపు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
కమలాపూర్: ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడే గెలుపు వరిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మద్దతుతో ఇటీవల గెలుపొందిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను మంగళవారం కమలాపూర్‌లో ఆయన సన్మానించి మాట్లాడారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలతో ఉన్న సత్సంబంధాలే బలమన్నారు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా మన వాళ్లేనని, కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తామన్నారు. 2021కి పూర్వం పార్టీలపరంగా కొట్లాటలు లేని ఏకైక నియోజకవర్గం హుజూరా బాద్ అని, ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయని స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా రాజేందర్ అన్నతో ఉండే బంధమే ఎక్కువని ఇతర పార్టీల్లో గెలిచిన వారు తన దగ్గరకు వస్తున్నారని, ప్రేమతో ఉండే వాళ్లు మనతో ఉంటారని, ఆఽశపడే వాళ్లు ఎన్నటికీ మన వాళ్లు కాదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, పార్టీ గుర్తులు ఉండవని, చెక్ పవర్ ఉన్న ఒకే ఒక్క పదవి సర్పంచ్ అని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కన్నా వార్డు మెంబర్, సర్పంచ్‌గా గెలవడమే కష్టమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో తట్టెడు మట్టి అయినా తీశాడా అని ప్రశ్నిస్తున్న వారిని ప్రజలు పట్టించుకోరని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎంనైనా కలుస్తానని, పంచాయతీలకు నిధులు ఆగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే వారందరిని గెలిపించుకునే బాధ్యత తనదన్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నాయకులు రాజయ్యయాదవ్, మాడ గౌతంరెడ్డి, ఎర్రబెల్లి సంపత్‌రావు, శీలం శ్రీనివాస్, శ్రీరాం శ్యాం, సురేందర్‌రాజు, తిరుపతిరెడ్డి, తుమ్మ శోభన్, కళాధర్ పాల్గొన్నారు.


