పేదల శ్రమను దోచుకునేందుకే నూతన బిల్లు
నర్సంపేట: పేదల శ్రమను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన బిల్లు తీసుకువచ్చిందని ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన బిల్లుకు వ్యతిరేకంగా ఎంసీపీఐ(యూ) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నూతన బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నో ప్రజా పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టం గ్రా మీణ ప్రాంతాల్లో పేదలకు ఎంతో ఆసరాగా నిలి చిందని, ఇప్పుడు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం బిల్లుతో పేదల కూలీల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ 125 రోజుల పని దినాలను కల్పిస్తూ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం, మోటం సురేష్, ప్రభాకర్, రాజు, జన్ను నీల, సీహెచ్.పుష్ప, అచల, ప్రమీల, ఈర్ల అనూష, జన్ను విజయ, కోమల, జయ, గడ్డం శ్రీను తదితరులు పాల్గొన్నారు.


