కమిషనరేట్‌లో ఎన్నికలు విజయవంతం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు విడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అభ్యర్థులు, ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు డీసీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకు మొత్తం 2 వేలకు పైగా పోలీసులు విధులు నిర్వహించారని, ఎన్నికల తేదీలు ఖరారైన నాటి నుంచి కమిషనరేట్ పరిధిలో నిబంధనలు పకడ్బందీగా అమలు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించామని, గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా రూ. 6.74 లక్షలు, 128 కేసుల్లో రూ.12.42 లక్షల విలువైన మద్యం సీసాలు, 49 కేసుల్లో రూ.1.27 లక్షల విలువైన 343 లీటర్ల గుడుంబా, రూ.1.23 లక్షల విలువైన గంజాయిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన 156 తుపాకులు స్వాధీనం చేసుకుని గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి 432 కేసుల్లో మొత్తం 2,638 మందిని బైండోవర్ చేసినట్లు సీపీ తెలిపారు.
పోలింగ్ కేంద్రాల సందర్శన
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సీపీ సన్ ప్రీతిసింగ్ సందర్శించారు. జనగామ జిల్లాలోని, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు ఎన్నికల తీరుతెన్నులను అధికారులతో కలిసి సమీక్షించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు.
పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
క్షేత్రస్థాయిలో బందోబస్తు పరిశీలన


