వెబ్‌కాస్టింగ్‌తో పోలింగ్ పరిశీలన
న్యూశాయంపేట: కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ కంట్రోల్ రూం నుంచి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ సత్యశారద నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో విడతలో నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో గుర్తించిన 110 సెన్సిటివ్, 282 క్రిటికల్ కేంద్రాల పోలింగ్, కౌటింగ్ ప్రక్రియను పర్యవేక్షించినట్లు తెలిపారు. అలాగే, నాలుగు మండలాలకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్తా చాటిన నిట్ విద్యార్థులు
● అభినందించిన నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
కాజీపేట అర్బన్: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25 పోటీల్లో నిట్ వరంగల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి సత్తాచాటారు. నిట్ వరంగల్ క్యాంపస్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హ్యాకథాన్–25లో ప్రథమ స్థానంలో నిలిచిన ది సిక్త్స్ సెన్స్ టీంను అభినందించి మాట్లాడారు. జైపూర్‌లోని మణిపాల్ యూనివర్సిటీలో ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25లో నిట్ వరంగల్‌కు చెందిన బీటెక్ విద్యార్థులు వత్సల్ సైనీ, కలాష్ జైన్, ముదిత్ శర్మ, రోమ సునీల్‌ధర్, రాజ్‌శేఖర్‌సింగ్, దృవ్ కర్నాకర్‌లు ది సిక్త్స్ సెన్స్ టీంగా పాల్గొన్నారు. 2017లో ప్రారంభమైన హ్యాకథాన్ నేడు భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థకు వేదికగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా 1,500కుపైగా కళాశాలల నుంచి లక్షకుపైగా విద్యార్థులు పాల్గొన్నట్లు, 36 గంటల పాటు కోడింగ్ మారథాన్ పోటీల్లో నిట్ విద్యార్థులు గ్రాండ్‌ఫైనల్‌కు చేరుకుని ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ప్రథమ స్థానంతోపాటు రూ.1.50 లక్షలు నగదు అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిట్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


