పోలింగ్ ప్రశాంతం
మూడో విడత నాలుగు మండలాల్లో 88.21 శాతం నమోదు
సాక్షి, వరంగల్: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 946 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పొటెత్తారు.1,24,555 మంది ఓటర్లకు 1,09,870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసుల భారీ భద్రత నడుమ 1,068 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1,309 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమక్షంలో ఉదయం 7 నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటలోపు క్యూలో నిలుచున్న ఓటర్లకు అవకాశం ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 9 గంటల వరకు 22.26 శాతంతో మందకొడిగా ఉన్న 11 గంటల వరకు 58.65 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 77.58 శాతం, ఆ తర్వాత క్యూలైన్లలో నిలుచొని ఓటేసిన వారితో పోలింగ్ 88.21 శాతానికి చేరుకుంది. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి, తిమ్మరాయినిపహాడ్, ఖానాపురం మండలంలోని ఖానాపురం, రంగంపేట, నర్సంపేట మండలంలోని లక్నెపల్లి, ఇటుకాలపల్లి, నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, అలంకానిపేట హరిత పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద ఓటర్లు ఫొటోలు దిగి సందడి చేశారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు పోలీసు నిషేధాజ్ఞలు ఉండడంతో అన్ని పార్టీల నేతలు అవతలే ఉండి తమ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. యువత, పురుషులు, మహిళలు, వృద్ధులు ఓటేసేందుకు రావడంతో పల్లెల్లో కోలాహలం నెలకొంది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు పడడం, ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇవీ మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది.
పురుషులు 88.47 శాతం..
మహిళలు 87.95 శాతం
నాలుగు మండలాల్లో 60,987 మంది పురుషులకు 53,959 మంది, 63,561 మంది మహిళలకు 55,908 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.47 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.95 శాతం ఓటేశారు. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. ఇతరుల ఓట్లు ఏడు ఉండగా ముగ్గురు మాత్రమే ఓటేశారు.
మూడో దశ
రెండో దశ
తొలి దశ
88.11%
88.21%
86.52%
మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు..
మండలం ఓటర్లు ఓటేసినవారు పోలింగ్ శాతం
చెన్నారావుపేట 31,351 28,163 89.83
ఖానాపురం 27,139 23,815 87.75
నర్సంపేట 22,472 19,740 87.84
నెక్కొండ 43,593 38,152 87.52
మొత్తం 1,24,555 1,09,870 88.21
తొలి, రెండు దశలను మించి
పెరిగిన ఓటింగ్ శాతం
ఓటు వినియోగంలో మహిళల కన్నా పురుషులే ముందంజు
ఓటు హక్కు వినియోగించుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంతూరు చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8వ వార్డులో సతీమణి శాలినిరెడ్డి, కుమారుడు అవియుక్త్‌రెడ్డితో కలిసి ఓటు వేశారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అమెరికా నుంచి అమీనాబాద్ గ్రామానికి వచ్చినట్లు అవియుక్త్‌రెడ్డి తెలిపారు.
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం


