మూడో విడత ప్రశాంతం
హన్మకొండ అర్బన్: జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 210 గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఎన్నికయ్యాయి. ఇక అధికారికంగా బాధ్యతలు స్వీకరించడమే తరువాయి. మూడో విడతలో 86.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో మొత్తం 1,11,341 మంది ఓటర్లు ఉండగా.. 96,239 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పది పంచాయతీలు ఏకగ్రీవం
జిల్లాలో మొత్తం 210 గ్రామ పంచాయతీలు, 1986 వార్డులు ఉన్నాయి. మూడు విడతల్లో కలిపి మొత్తం 10 గ్రామ పంచాయతీలు పూర్తి పాలకవర్గంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 200 గ్రామ పంచాయతీలకు అధికారులు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. మొదటి విడతలో 69 జీపీలు, రెండో విడతలో 73 జీపీలు, మూడో విడతలో 68 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపట్టిన అధికారులు ఫలితాలు వెల్లడించారు. పోలింగ్, ఫలితాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయోత్సవాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ గెలిచిన అభ్యర్థుల ఆనందోత్సాహాలను గ్రామాల్లో అడ్డుకునే పరిస్థితి కనిపించలేదు.
ప్రశాంతం..
జిల్లాలో మూడు విడతల ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొదటి నుంచి జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై పక్కా ప్రణాళికతో పనిచేసింది. కలెక్టర్, ఆర్డీఓలు, పంచాయతీరాజ్ శాఖ, ఇతర అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా కలెక్టర్, ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ పర్యవేక్షించారు. నిత్యం పోలింగ్ కేంద్రాలు, పంపిణీ కేంద్రాలను తనిఖీ చేయడం, అధికారులు సూచనలు చేయడం, పోలింగ్ రోజు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించడం వంటివి చేస్తూ యంత్రాంగంలో ఉత్సాహం నింపారు. మొత్తంగా టీం వర్క్‌గా పనిచేసి సక్సస్ అయ్యారని చెప్పొచ్చు.
ఊపిరి పీల్చుకున్న
అధికార యంత్రాంగం
జిల్లాలో 86.44 శాతం పోలింగ్
సంబురాల్లో మునిగిన విజేతలు


