అంబరాన్నంటిన పంబారట్టు
● శరణుఘోషతో మార్మోగిన
మాదన్నపేట చెరువుకట్ట
● భారీగా హాజరైన భక్తులు
నర్సంపేట రూరల్: మండలంలోని మాదన్నపేట చెరువుకట్టపై పంబారట్టు వేడుకలు అంబరాన్నంటాయి. కేరళ రాష్ట్రంలో నిర్వహించే తరహాలో అయ్యప్పస్వామికి అష్టాభిషేకాలు, జలక్రీడలు నిర్వహించారు. మాదన్నపేట చెరువుకట్టపై వేదపండితులు తాంత్రివేత్త, శబరిమల దేవాలయ మేల్‌శాంతి శ్రీమాన్ శంకరన్ నంబూద్రి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దంపతుల సమక్షంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మంగళవాయిధ్యాలు, సాంప్రదాయ సంగీతం, స్వాముల శరణుఘోష, కళాకారుల వేషధారణ, విన్యాసాలతో ఆలయం నుంచి ఊరేగింపు నిర్వహించారు. మహిళల కోలాటాలు, భక్తి పాటలతో నర్సంపేట మార్మోగింది. ఆలయం నుంచి వరంగల్ రోడ్డు కూడలి, బస్టాండ్, అంగడి సెంటర్, అంబేడ్కర్ సెంటర్, జయలక్ష్మీ సెంటర్ మీదుగా కమలాపురం గ్రా మం నుంచి మాదన్నపేట చెరువుకు చేరుకున్నారు.
అష్టాభిషేకాలు..జలక్రీడలు
శబరిమలలో అయ్యప్పస్వామికి నిర్వహించే తరహాలో నర్సంపేటలోని మాదన్నపేట చెరువు కట్టపై అష్టాభిషేకాలు, జలక్రీడలు నిర్వహించారు. 25 సంవత్సరాలుగా పంబారట్టు నిర్వహిస్తుండగా 20 సంవత్సరాలుగా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో 24 రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మాదన్నపేట చెరువులో జలక్రీడలు నిర్వహించారు. దీంతో మాదన్నపేట చెరువుకట్ట అయ్యప్పశరణుఘోషతో మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన మహశాస్త్ర సేవాట్రస్ట్ వ్యవస్థాపకుడు, గురుస్వామి సుదగాని రాజుగౌడ్, భద్రకాళి దేవాలయ అర్చకుడు రామకృష్ణ శర్మ, అయ్యప్పస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, కమిటీ అధ్యక్షుడు సైప సురేష్, దేవేశ్‌మిశ్రా, బీఆర్‌ఎస్ నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
అంబరాన్నంటిన పంబారట్టు


