ప్రలోభాలు షురూ
ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది..
● మొదటి విడత ప్రచారం బంద్
● అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్
● రేపు 80 సర్పంచ్, 585 వార్డులకు పోలింగ్
● 48 గంటలు మద్యం అమ్మకాలు నిషేధం
మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం ముగియడంతో అభ్యర్థులు, నాయకులు పోలింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. రేపు (గురువారం) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలివిడత పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 80 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు 731 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండగా 877 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అదనపు ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 600 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
వరంగల్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగి సింది. ప్రచారం ముగియడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల బాట పట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో వారి కంట పడకుండా ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దిగుమతి చేసుకున్నాయి. పంపిణీ మొత్తం ఇతర ప్రాంతాల నాయకుల పర్యవేక్షణలో సాగనుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని గ్రామ పంచాయతీలను గెలుచుకునేందుకు ‘సామ.. దాన.. బేధ.. దండోపాయం’ చర్యలను అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసే వారి ఇంటి ముందు పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మోహరింపజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఈ విషయం గుర్తించి ముందుగానే మద్యం, డబ్బులను ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు అప్పగించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికలు పూర్తిగా స్థానికం కావడంతో పార్టీలను పరిగణలోకి తీసుకోకుండా పోటీ చేసిన అభ్యర్థులను బట్టి గెలుపోటములను ఓటర్లు నిర్ణయిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
80 పంచాయతీలు.. 585 వార్డుల్లో ఎన్నికలు..
మొదటి విడత ఎన్నికలు జరిగే పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోని 91 గ్రామ పంచాయతీలు ఉండగా 11 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా మిగిలిన 80 పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాల్లో 310 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 800 వార్డులకు గాను 214 వార్డులు ఏకగ్రీవం కాగా 585 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 1,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మద్యం దుకాణాలు బంద్..
ఎన్నికల నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు తొలి విడత ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు బంద్ అమల్లోకి వ చ్చింది. ఇక మొదటి విడతలో ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికై , పోటీ లేకుండానే కొత్త పాలన బాధ్యతలు చేపట్టనున్నాయి. తొలి విడత పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ వేడి పెరుగుతుండగా.. అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
ప్రలోభాలు షురూ
ప్రలోభాలు షురూ
ప్రలోభాలు షురూ


