యాక్షన్ ప్లాన్ రెడీ
సాక్షిప్రతినిధి, వరంగల్:
యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్‌లో 9,48,114 ఎకరాలకు 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగిలో సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
ఎక్కడెక్కడ ఎలా?
ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ (ఎల్‌ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు.
ములుగు ఇరిగేషన్ సర్కిల్‌లో ఇలా..
ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్‌ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకు 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు ‘స్కివం’ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు 4,550, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు 1,500 ఎకరాలకే ఈసారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు.
ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతే..
ఉమ్మడి వరంగల్‌లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్‌ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు.
ఈ నెల 24 నుంచి ఉమ్మడి వరంగల్‌లో యాసంగి పంటలకు సాగు నీరు
5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు!
యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ
వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు
15 రోజులకోసారి ఆన్‌అండ్‌ఆఫ్
గత యాసంగిలో
6,46,664 ఎకరాలకు సాగు నీరు
ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు
అందించేలా ప్రణాళిక
గతేడాదితో పోలిస్తే తగ్గిన
1,16,938 ఎకరాలు
వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలు


